Statue of Gaddar at Tank Bund : ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ కు గత 9 ఏళ్లుగా సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు అని, తాను నియంత అని బీఆర్ఎస్ అధినేత నిరూపించుకున్నారు అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. గతంలో గద్దర్ ను జైల్లో సైతం పెట్టించిన ఘనుడు కేసీఆర్ అంటూ మండిపడ్డారు. గద్దర్ కుటుంబసభ్యులను షర్మిల ఆదివారం పరామర్శించారు. గద్దర్ భార్య కన్నీళ్లు పెట్టుకుంటే ఆమెను ఓదార్చారు. గద్దర్ ఆశయాల కోసం పనిచేద్దామని పిలుపునిచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గద్దర్ అన్న జీవితాంతం ప్రజల కోసం పోరాడారని, అలాంటి వ్యక్తికి కేసీఆర్ ఒక్కసారి కూడా అపాయింట్ మెంట్ ఇవ్వకుండా అవమానించారని చెప్పారు. 


ప్రజల కోసం గద్దర్ తన జీవితాన్ని త్యాగం చేశారని.. ట్యాంక్ బండ్ పై గద్దర్ విగ్రహాన్ని పెట్టాలని, గద్దర్ జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో ముద్రించాలి అని షర్మిల డిమాండ్ చేశారు. గద్దర్ సొంత ఊరు తూప్రాన్ లో స్మారక భవనం నిర్మించాలన్నారు. గద్దర్ ను కేసీఆర్ కంటతడి పెట్టించారని, ప్రగతి భవన్ దగ్గర రోజంతా ఎదురు చూసినా లోపలకు పిలవలేదు అని గుర్తుచేశారు. ప్రజల సమస్యలు చెప్పుకునేందుకు వెళ్తే ఇంత అవమానమా అని బాధపడ్డారు. ఇందుకేనా తెలంగాణ తెచ్చుకున్నది అని గద్దర్ కన్నీళ్లు పెట్టుకున్నారని చెప్పారు. గద్దరన్న ఉన్న రోజుల్లో పట్టించుకున్న పాపాన పోలేదు కానీ, చనిపోయాక డ్రామాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.


ప్రజా గాయకుడు ఉన్నప్పుడు అవమానించిన కేసీఆర్ ఇప్పుడు కపట ప్రేమను వ్యక్తం చేస్తున్నారని, లేని పోని సానుభూతి వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు. గద్దర్ కుటుంబ సభ్యులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గద్దర్ ఒక లెజెండ్ అని, గద్దర్ కి మరణం లేదని.. కోట్ల మంది ప్రజల గుండెల్లో ఇంకా బతికే ఉన్నాడన్నారు వైఎస్ షర్మిల. వైఎస్సార్ అంటే గద్దర్ కి చాలా ప్రేమ. నాతో చాలా సార్లు వైఎస్సార్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశాడని చెప్పారు. గద్దర్ కి వైఎస్సార్ గన్ మెన్ లను ఏర్పాటు చేశారు. గద్దర్ గుండెల్లో వైఎస్సార్ ఉన్నాడు. మన గుండెల్లో గద్దర్ ఉన్నాడని, తనను చాలా అభిమానించారు అని గద్దర్ గురించి ప్రస్తావించారు.