తెలంగాణలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యే అభ్యర్థులకు శిక్షణకు పోలీస్‌శాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఎస్‌ఐ తుది ఎంపిక ఫలితాలు వెలువడినప్పటికీ.. కానిస్టేబుల్ ఎంపిక ఫలితాల వెల్లడి విషయంలో మాత్రం జాప్యం జరుగుతోంది. దీనికి జీవో నం.46కు సంబంధించిన న్యాయవివాదం నడుస్తుండడమే కారణం. అయితే ఆగస్టు నెలాఖరు లేదా సెప్టెంబరు మొదటి వారంలో కానిస్టేబుల్ తుది ఫలితాలు కూడా వెలువడే అవకాశం ఉంది. అనంతరం 20 రోజులపాటు ఎంపికైన కానిస్టేబుళ్లపై స్పెషల్ బ్రాంచ్ విచారణ చేపట్టనుంది. ఎలాంటి సమస్య లేనివారి పేర్లను తుది జాబితాలో చేరుస్తారు. అన్నీ సవ్యంగా జరిగితే అక్టోబరు 1 నుంచే కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ప్రారంభించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. 

పోలీసు ఉద్యోగాలకు ఎంపికయ్యే 554 మంది ఎస్‌ఐ, 9,871 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు రాష్ట్రవ్యాప్తంగా 28 కేంద్రాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వీరిలో దాదాపు 2,200 మంది మహిళల కోసం ప్రత్యేకంగా మూడు కేంద్రాలను కేటాయించింది. ఎంపికైన ఎస్‌ఐ అభ్యర్థులకు రాజా బహద్దూర్‌ వెంకట్రాంరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ అకాడమీలో ఏడాదిపాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఇక కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి 9 నెలలపాటు శిక్షణ కోసం టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్‌ శిక్షణ కేంద్రాలు(బీటీసీలు), పోలీస్‌ శిక్షణ కళాశాలలు(పీటీసీలు), నగర శిక్షణ కేంద్రాల(సీటీసీలు) మైదానాల్ని వినియోగించేందుకు పోలీస్‌శాఖ సన్నాహాలు చేస్తోంది. మైదానాల చదును, శిక్షణార్థులకు వసతి కల్పించే పనులను చేపట్టింది. 

రెండో విడతలోనే టీఎస్‌ఎస్‌పీకి శిక్షణ..
పోలీసు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల శిక్షణకు సరిపడా మైదానాలు లేకపోవడంతో ఈసారి కూడా టీఎస్‌ఎస్‌పీ శిక్షణను రెండో విడతలోనే నిర్వహించనున్నారు. ఈసారి మొత్తం 17,156 కానిస్టేబుళ్ల స్థాయి పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించారు. జైళ్లు, ఫైర్ తదితర విభాగాల పోస్టులుపోను 14,881 మంది కానిస్టేబుళ్లను ఎంపిక చేయనున్నారు. వీరిలో 5,010 టీఎస్‌ఎస్‌పీ, 4,965 సివిల్, 4,523 ఏఆర్, 121 పీటీవో, 262 ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్ విభాగాల కానిస్టేబుళ్లున్నారు. అయితే రాష్ట్రంలో పోలీస్ శాఖకు 12 వేల మందికి సరిపడా మాత్రమే శిక్షణ మైదానాలు ఉన్నాయి. దాంతో 2018 నోటిఫికేషన్‌లో ఎంపికైన 16 వేల మంది శిక్షణకు మైదానాలు సరిపోవని టీఎస్‌ఎస్‌పీ శిక్షణను 9 నెలలు వాయిదా వేశారు. ఈసారి కూడా అలాగే చేసే అవకాశం ఉంది.

సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ ఇక్కడే..
సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అంబర్‌పేట పీటీసీ, కరీంనగర్ పీటీసీ, సైబరాబాద్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్ సీటీసీ, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ డీటీసీల్లో శిక్షణ ఇవ్వనున్నారు.

శిక్షణ కేంద్రం అభ్యర్థుల సంఖ్య
అంబర్‌పేట పీటీసీ 650
కరీంనగర్ పీటీసీ- 912
సైబరాబాద్ సీపీటీసీ 250 
కరీంనగర్ సీపీటీసీ 250 
ఖమ్మం సీపీటీసీ 250
నిజామాబాద్ సీపీటీసీ 250
వరంగల్ సీపీటీసీ 250
ఆదిలాబాద్ డీటీసీ 250
మహబూబ్ నగర్ డీటీసీ 250

మహిళా కానిస్టేబుల్స్‌కు ప్రత్యేక కేంద్రాలు..
మహిళా కానిస్టేబుళ్లకు శిక్షణ ఇచ్చేందుకు మూడు ప్రత్యేక కేంద్రాల్ని కేటాయించారు. క్రితంసారి వీరందరికీ టీఎస్‌పీఏలోనే శిక్షణ ఇచ్చారు. ఈసారి సంఖ్య ఎక్కువ కావడంతో టీఎస్‌పీఏతోపాటు మరో రెండు కేంద్రాలను ఎంపిక చేశారు. టీఎస్‌పీఏలో 653 మంది సివిల్, వరంగల్ పీటీసీలో వేయి మంది సివిల్, మేడ్చల్ పీటీసీలో 442 ఏఆర్ కానిస్టేబుళ్లకు శిక్షణ ఇస్తారు.

శిక్షణ కేంద్రం అభ్యర్థుల సంఖ్య
మేడ్చల్ పీటీసీ  442
నల్గొండ డీటీసీ  216
సంగారెడ్డి డీటీసీ  225
వికారాబాద్ డీటీసీ 215
చేలాపురా ఎంబీసీఎల్  275
గోషామహల్ ఎంబీసీఎల్  250
టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్-యూసుఫ్ గూడ  400
టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్-ఇబ్రహీంపట్నం  250
టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్-మామునూర్  300
టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్-డిచ్‌పల్లి  350
టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్-కొండాపూర్  450
టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్-బీచ్‌పల్లి  300
టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్-నల్గొండ  300
టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్-మంచిర్యాల 350
టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్-సత్తుపల్లి 200

ALSO READ:

తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేసిన సీఎం కేసీఆర్ - కొత్త షెడ్యూల్ ఇలా
గ్రూప్ 2 అభ్యర్థులు, ప్రతిపక్షాల పోరాటం ఫలించింది. తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ మేరకు ఎగ్జామ్ రీషెడ్యూల్ పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని టీఎస్‌పీఎస్సీతో సంప్రదించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. లక్షలాది మంది అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. తాజా నిర్ణయంతో ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించాల్సిన గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడింది.  గ్రూప్ 2 ఎగ్జామ్ నవంబర్ నెలకు (TSPSC Group 2 Exam In November) రీషెడ్యూల్ చేసినట్లు సమాచారం. సీఎస్, టీఎస్ పీఎస్సీ అధికారులు చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎగ్జామ్ నిర్వహించేలా కనిపిస్తోంది. త్వరలో తేదీలను ప్రకటించనున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..