Telangana Group 2 Reschedule TSPSC Group 2 Exam postponed:
గ్రూప్ 2 అభ్యర్థులు, ప్రతిపక్షాల పోరాటం ఫలించింది. తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ మేరకు ఎగ్జామ్ రీషెడ్యూల్ పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని టీఎస్పీఎస్సీతో సంప్రదించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. లక్షలాది మంది అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. తాజా నిర్ణయంతో ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించాల్సిన గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడింది. గ్రూప్ 2 ఎగ్జామ్ నవంబర్ నెలకు (TSPSC Group 2 Exam In November) రీషెడ్యూల్ చేసినట్లు సమాచారం. సీఎస్, టీఎస్ పీఎస్సీ అధికారులు చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎగ్జామ్ నిర్వహించేలా కనిపిస్తోంది. త్వరలో తేదీలను ప్రకటించనున్నారు.
భవిష్యత్తులో కమిషన్ విడుదల చేసే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు ఒకేసారి ఎగ్జామ్ నిర్వహించేలా కాకుండా, అభ్యర్థులు ప్రిపరేషన్ కు తగిన సమయం ఉండేలా ప్లాన్ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. టీఎస్పీఎస్సీతో చర్చించి గ్రూప్-2 పరీక్షను రీషెడ్యూల్ చేయాలని సీఎస్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అలా ప్లాన్ ప్రకారం జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయడం ద్వారా అర్హులైన అందరు అభ్యర్థులు అన్ని పరీక్షలకు సన్నద్ధం కావడానికి అవకాశం ఉంటుందని కేసీఆర్ సూచించారు.
అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన.. అంతలోనే నిర్ణయం మారింది!
తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష వాయిదా వేస్తారని అనుకున్నదే జరిగింది. అయితే కొన్ని రోజుల కిందటి వరకు గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదాపై ఊహాగానాలు ప్రచారంలో ఉండగా.. పుకార్లకు చెక్ ప్రభుత్వం ఫుల్స్టాప్ పెట్టింది. షెడ్యూల్ ప్రకారమే గ్రూప్-2 పరీక్ష జరుగుతుందని ఆదివారం (జులై 6) అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేయడం తెలిసిందే. సీఎం ప్రకటన చేశాక ఇక మార్పు ఏముంటుందని కొందరు అభ్యర్థులు భావించగా.. అటు గురుకుల సహా ఇతర పోస్టులకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు గ్రూప్ 2 ప్రిపరేషన్ కు సమయం చాలలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగైదు రోజులపాటు టీఎస్ పీఎస్సీ కార్యాలయం ముట్టడికి సైతం యత్నించారు. టీఎస్పీఎస్సీ సైతం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే గ్రూప్-2 పరీక్ష నిర్వహించాలని భావిస్తున్న సమయంలో అభ్యర్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేయాలని నిర్ణయించారు. టీఎస్ పీఎస్సీ అధికారులతో మాట్లాడి ఎగ్జామ్ రీషెడ్యూల్ చేయాలని సీఎస్ శాంతికుమారిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రతిపక్షాలతో పాటు అభ్యర్థులు సైతం గగ్గోలు పెట్టడంతో ప్రభుత్వం గ్రూప్ 2 ఎగ్జామ్ ను నవంబర్ కు రీషెడ్యూల్ చేసింది.