తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ దావోస్‌ పర్యటనలో భాగంగా ఓ అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికపై ప్రసంగించేందుకు ప్రస్తుతం దావోస్ లో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంతో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ (సీ4ఐఆర్‌) అనే సంస్థ ఒప్పందం చేసుకుంది. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో సోమవారం (జనవరి 16) ఈ ఒప్పందం జరిగింది. హెల్త్‌ కేర్‌, లైఫ్‌ సెన్సెస్‌ రంగాల్లో సీ4ఐఆర్‌ సంస్థ సేవలు అందించనుంది. ఇప్పటికే అమెరికా, బ్రిటన్‌లో ఈ సంస్థ సేవలు అందిస్తుంది. సోమవారం దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశంలో దేశంలోనే ఈ రకమైన మొదటి కేంద్రాన్ని ప్రకటించారు. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి కేంద్రం. స్వయంప్రతిపత్తి కలిగిన, లాభాపేక్ష లేని సంస్థ, ఆరోగ్య సంరక్షణ, లైఫ్‌ సెన్సెస్‌ పై ప్రముఖంగా పని చేస్తుంది. 


వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జుర్జెన్స్ తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శక్తి నాగప్పన్‌తో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు. హెల్త్‌ కేర్‌, లైఫ్‌ సెన్సెస్‌పై దృష్టి సారించిన సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ (సీ4ఐఆర్‌) ని నెలకొల్పడానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ హైదరాబాద్‌ను తన భారతదేశ హబ్‌గా ఎంపిక చేసుకున్నందుకు సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. 


హైదరాబాద్‌లో సీ4ఐఆర్‌ సంస్థ ఏర్పాటుతో తెలంగాణలో లైఫ్ సైన్సెస్ రంగానికి ప్రస్తుతం ఉన్న పర్యావరణ వ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వ సమర్థతను ప్రతిబింబిస్తుందని మంత్రి అన్నారు. తెలంగాణలో లైఫ్ సైన్స్ ప్రాధాన్యత రంగాల్లో ఒకటని, హైదరాబాద్‌లో సీ4ఐఆర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలనే నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం సృష్టించిన విలువ అని అన్నారు. ఇది ప్రస్తుత పర్యావరణ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని కేటీఆర్‌ అన్నారు. సీ4ఐఆర్‌ సంస్థ ఏర్పాటుతో ప్రభుత్వ రంగం, ఎస్‌ఎంఈల మధ్య అనుసంధానం ఏర్పడడంతో పాటు ఆరోగ్య సంరక్షణ రంగంలో ఉపాధిని సృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అధ్యక్షుడు బోర్గే బ్రెండే అన్నారు.


వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ హెడ్ (హెల్త్‌కేర్) డాక్టర్ శ్యామ్ బిషన్ మాట్లాడుతూ, “వ్యాక్సిన్‌లు,  డ్రగ్స్ తయారీలో బలమైన ట్రాక్ రికార్డ్‌తో పాటు నాల్గవ పారిశ్రామిక విప్లవ సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సుముఖతతో భారతదేశం, హైదరాబాద్‌లు ఆరోగ్య సంరక్షణలో గ్లోబల్ హబ్‌గా మారేందుకు సిద్ధంగా ఉన్నాయి. లైఫ్ సైన్సెస్ రంగంలో దాని బలాలతో, ఈ ప్రయత్నానికి నాయకత్వం వహించడానికి ఈ ఒప్పందం ప్రత్యేకంగా నిలిచింది. ప్రాంతీయ, జాతీయ, ప్రపంచ ఆరోగ్య సంరక్షణ రంగాన్ని మార్చడంలో ఏర్పాటు కాబోయే కొత్త సెంటర్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దాని ఫలితాలతో రోగులకు మెరుగైన సౌలభ్యాన్ని సులభతరం చేస్తుంది’’ అని అన్నారు.