Hyderabad News: బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ల కారణంగానే మలక్ పేట ప్రభుత్వాసుపత్రిలో బాలింతలు మృతి చెందినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఆసుపత్రిలో పరిశుభ్రతా లోపం వల్లే ఇలా జరిగినట్లు గుర్తించారు. ఈ ఇద్దరితోపాటు అంతకు ముందు సిజేరియన్ చేయించుకున్న మరో 18 మందిని నిమ్స్ అత్యవసర విభాగానికి అప్పటికప్పుడు తరలించారు. ఇందులో ఇద్దరు బాలింతల కిడ్నీలకు ఇన్ ఫెక్షన్ సోకడంతో రెండు రోజులుగా డయాలసిస్ చేస్తున్నారు. ప్రస్తుతం వీలి ఆరోగ్యం కాస్త ఆందోళనకరంగా ఉందని.. కోలుకోవడానికి మరికొంత కాలం సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. మరో తొమ్మిది మందిని సోమవారం డిశ్చార్జి చేయగా.. ఇంకా ఏడుగురు బాలింతలు చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు. 


అసలేం జరిగిందంటే..?


నాగర్‌ కర్నూలు జిల్లా వెల్దండ మండలం చెదురుపల్లి గ్రామానికి చెందిన మహేశ్‌ తన భార్య సిరివెన్నెల (23)తో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నారు. మహేశ్‌ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన భార్య సిరివెన్నెలను కాన్పు కోసం ఇటీవల మలక్‌పేట్‌ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. సిరివెన్నెలకు వైద్యులు ఆపరేషన్ చేయగా, పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. డెలివరీ తర్వాత సిరివెన్నెల అస్వస్థతకు గురికావడంతో ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సిరివెన్నెల మరణించింది. మలక్‌పేట్ ఏరియా ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంగానే సిరివెన్నెల చనిపోయిందంటూ బంధువుల ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని చాదర్‌ఘాట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  మరో ఘటనలో తిరుపతికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ జగదీశ్‌, తన 24 ఏళ్ల భార్య శివాణిని ఈ నెల 9న మలక్‌పేట్‌ ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రిలో శివాని మగబడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించగా.. ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శివాని మృతిచెందింది.  


అయితే వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే వీరిద్దరూ చనిపోయినట్లు కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. వారి తీరును నిరసిస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళన కూడా చేశారు. అయితే అయితే ఈ ఘటనలపై డీసీహెచ్ఎస్ సునీత స్పందించారు. సిరివెన్నెలను రెండో కాన్పు కోసం ఈ నెల 9న ఆస్పత్రికి తీసుకొచ్చారని. 11న కాన్పు చేశారని తెలిపారు. డెలివరీకి ముందు చేసిన వైద్య పరీక్షల్లో ఎలాంటి లోపాలు కనిపించలేదన్నారు. 12వ తేదీన సిరివెన్నెల శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందంటే ఆమెను వెంటనే గుండె సంబంధిత వైద్యులను సంప్రదించాల్సిందిగా సూచించామన్నారు. దీంతో వైద్యులు వెంటనే ఆమెను గాంధీకి రిఫర్‌ చేశారన్నారు. గాంధీలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి సిరివెన్నెల ప్రాణాలు కోల్పోయారని, ఈ ఘటనపై విచారణ చేస్తామన్నారు. మరో ఘటనలో శివాని డయేరియా సమస్యతో ఇటీవల ఆస్పత్రిలో చేరారని తెలిపారు. శివానికి హైపోథైరాయిడ్‌ సమస్య ఉందన్నారు.


ఆమెకు నొప్పులు రావడంతో ఈ నెల 11న కాన్పు చేశారన్నారు. గురువారం రాత్రి శివాని మరోసారి అస్వస్థతకు గురవ్వడంతో వైద్యుల సూచనతో గాంధీకి రిఫర్ చేశామన్నారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున శివాని మృతి చెందిందని డీసీహెచ్‌ఎస్‌ సునీత తెలిపారు. బాలింతల మృతిలో వైద్యుల నిర్లక్ష్యం లేదని ఆమె అంటున్నారు.  ఈ ఘటనలపై పూర్తి స్థాయి విచారణ కోసం ఒక బృందాన్ని కమిషనర్‌ నియమించినట్లు తెలిపారు. తాజా విచారణలో బాలింతల మృతికి బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్లే కారణం అని తేలడంతో తప్పు ఎక్కడ జరిగిందనే విషయమై వారు ఆరా తీస్తున్నారు.