75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని బస్ భవన్ లో ఎండి సజ్జనార్ పలువురు ఆర్టీసీ సిబ్బందికి ఉత్తమ బహుమతులను అందించి అభినందించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ గర్భిణి బస్సులోనే ప్రసవించడంతో సురక్షితంగా ఆస్పత్రికి చేర్చి తల్లి, బిడ్డలను కాపాడిన ఆర్టీసీ సిబ్బందిని అభినందిస్తూ ఎండీ సజ్జనార్ వారి చేతుల మీదుగా అవార్డులను ప్రధానం చేశారు.
మారిన తెలంగాణ ఆర్టీసీ..
తెలంగాణ ఆర్టీసీకి సజ్జనార్ ఎండీగా వచ్చిన తర్వాత చాలా మార్పు కనిపిస్తోంది. రాష్ట్ర ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు అందుతున్నాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఆర్టీసీ కార్గో ద్వారా సరకుల సరఫరా జరుగుతోంది. అది ఒక్కటే కాకుండా ఇంకా చాలా సేవలు అందిస్తున్నారు. ప్రైవేటు ట్రాన్స్ పోర్టుల్లాగా ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నారు. ప్రత్యేక సందర్భాల్లో వివిధ రాయితీలు, ఆఫర్లు ప్రకటించి ప్రజలను ఆర్టీసీ బస్సుల వైపు ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉత్తమ పని తీరు కనబరిచిన ఆర్టీసీ సిబ్బందికి పురస్కారాలు, అవార్డులు, రివార్డులు అందిస్తున్నారు.
వారికి పురస్కారం..
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఆర్టీసీ డిపోలో పని చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్ అంజన్న, కండక్టర్ గబ్బర్ సింగ్ 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎండీ సజ్జనార్ చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు. గత రెండు నెలల క్రితం జూన్ 26వ తేదిన ఉట్నూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో విధులు నిర్వహిస్తున్న క్రమంలో బస్సులో ప్రయాణిస్తున్న ఓ గర్భిణీ బస్సులోనే ప్రసవించింది. ఆ తల్లి బిడ్డలను సురక్షితంగా అదే బస్సులోనే సమీపంలోని గుడి హత్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి చేర్పించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సిబ్బందిని మెచ్చుకున్నారు.
ఆ బిడ్డకు జీవిత కాలం ఫ్రీ
బస్సులో జన్మించిన బాబుకు జీవిత కాలం పాటు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు ప్రకటించారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. నేడు 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా హైదరాబాద్ లోని బస్ భవన్ లో ఏర్పాటు చేసిన వేడుకలలో ఉట్నూర్ ఆర్టీసి డిపోలో పని చేస్తున్న డ్రైవర్ అంజన్న, కండక్టర్ గబ్బర్ సింగ్ ను ఆర్టీసీ బస్సులో ప్రసవించిన తల్లి బిడ్డలకు అందించిన సేవలను గుర్తించి ఎండీ సజ్జనార్ వారికి ప్రశంశ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులలో సిబ్బంది చేస్తున్న సేవలను సజ్జనార్ కొనియాడారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తమ సేవలను గుర్తించి అవార్డులను అందజేసినందుకు డ్రైవర్ అంజన్న, కండక్టర్ గబ్బర్ సింగ్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఉట్నూర్ ఆర్టీసీ డిపో మరియు ఆదిలాబాద్ జిల్లా ఆర్టీసీ యాజమాన్యానికి ఎల్లప్పుడు రుణపడి ఉంటామని, తమ సేవలను ప్రజలకు చేరువలో మరింతగా కొనసాగిస్తామన్నారు.
ట్విట్టర్ ద్వారా అందుబాటులోనే..
ఆర్టీసీ బాధ్యతలను భుజానికి ఎత్తుకున్న సజ్జనార్.. ఆ సంస్థను తిరిగి గాడిన పెట్టే పనిలో నిమగ్నమయ్యారు. ప్రజలను ఆర్టీసీ వైపు మళ్లించడాన్ని మొదటి అడుగుగా భావించారు. మెరుగైన సేవలు, సౌకర్యాల పెంపు, కొత్త సేవలు అందించడం లాంటి చర్యలు తీసుకున్నారు. పండగలు, పబ్బాలు అయితే వాటిని అనుగుణంగా ఏదో ఒక రాయితీ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. అలా ఆర్టీసీ వైపు జనాలను ఆకర్షిస్తున్నారు. అలాగే నష్టాల్లో ఉన్న సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయాలంటే తీసుకోవాల్సిన చర్యల్లో మొదటిది టికెట్ల రేట్లు పెంచడం. సజ్జనార్ వచ్చాకా.. ఆర్టీసీ టికెట్ల రేట్లు పలుమార్లు పెరిగాయి.