Tummmala Nageswararao : ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుప్రతికి వెళ్లిన తుమ్మల నాగేశ్వరరావు కృష్ణయ్య మృతదేహాన్ని పరిశీలించారు. కృష్ణయ్య కుటుంబ సభ్యులను తుమ్మల పరామర్శించారు. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ నేత హత్య కలకలం రేపుతోంది. కృష్ణయ్య హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ్మినేని కోటేశ్వరరావు ఇంటిపై కృష్ణయ్య అనుచరులు దాడి చేశారు. ఇంట్లో ఫర్మిచర్ ను ధ్వంసం చేశారు. అలాగే తమ్మినేని ఆస్తులను ధ్వంసం చేశారు.
కార్యకర్తలు ఆవేశపడొద్దు
తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. గత 30 ఏళ్లుగా హత్యారాజకీయాలకు జిల్లా దూరంగా ఉందన్నారు. కృష్ణయ్యను అత్యంత దారుణం హతమార్చారన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని తుమ్మల డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కార్యకర్తలు ఆవేశపడొద్దన్నారు. ఎటువంటి దాడులకు పాల్పడవద్దని కోరారు. హత్యారాజకీయాలు జిల్లాకు మంచిది కాదన్నారు. మంత్రి కేటీఆర్‌తో ఫోన్ లో మాట్లాడి జరిగిన విషయాన్ని వివరించానని తుమ్మల అన్నారు. నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరానన్నారు.
తుమ్మల అనుచరుడి హత్య
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు, టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్యను దుండగులు దారుణంగా హత్య చేశారు. ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లిలో బైక్‌పై వెళ్తోన్న ఆయనను దుండగులు ఆటోతో ఢీకొట్టి అనంతరం వేటకొడవళ్లతో దాడి చేసి హత్య చేశారు. ఈ దాడిలో ఆరుగురు పాల్గొనున్నట్లు తెలుస్తోంది. తెల్దారుపల్లి శివారులోని రోడ్డుపై ఈ దాడి ఘటన జరిగింది. తమ్మినేని కృష్ణయ్య ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సహకార సంఘం డైరెక్టర్‌గా ఉన్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. రాజకీయ కక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
కోటేశ్వరరావు ఇంటిపై దాడి
తమ్మినేని కృష్ణయ్య హత్యకు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం సోదరుడు కోటేశ్వరరావు కారణమని తెల్దారుపల్లికి చెందిన స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. కోటేశ్వరరావు ఇంటిపై వారు దాడికి పాల్పడ్డారు. ఆయన ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి కృష్ణయ్య వరుసకు సోదరుడు అవుతాడు. కృష్ణయ్య సీపీఎంలో పనిచేశారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్‌లో చేరారు. తెల్దారుపల్లిలో రాజకీయ విద్వేషాలే ఈ దారుణ హత్యకు కారణంగా తెలుస్తోంది. వీరభద్రం సొంత సోదరుడితో కృష్ణయ్యకు విభేదాలు ఉన్నాయని స్థానికులు అంటున్నారు. ఈ హత్య అనంతరం కృష్ణయ్య వర్గీయులు తమ్మినేని కోటేశ్వరరావు ఇంటిపై దాడి ఇంట్లో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో తెల్దారుపల్లిలో హైటెన్షన్ నెలకొంది. గ్రామంలో పోలీసులను మోహరించారు.
Also Read : Khammam News : తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు దారుణ హత్య, ఆటోతో ఢీకొట్టి వేటకొడవళ్లతో నరికి!
Also Read : Jagadish Reddy: కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఇవే చివరి ఎలక్షన్స్, ఈడీ బోడీలు ఏం చేయలేవు - మంత్రి జగదీశ్ వ్యాఖ్యలు