ఖమ్మం జిల్లా తెల్లారుపల్లి గ్రామంలో దారుణహత్య జరిగింది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు, గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నేత కృష్ణయ్యను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. కృష్ణయ్యకు సీపీఎ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వరుసకు సోదరుడు. బైకుపై వెళ్తున్న కృష్ణయ్యను దుండగులు ఆటోతో ఢీ కొట్టారు. ఆ తర్వాత కింద పడ్డ అతడిపై బండరాళ్లు, వేట కొడవళ్లతో ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హతమార్చారు. కృష్ణయ్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తెల్దారుపల్లి శివారులోని రోడ్డుపై ఈ దారుణ ఘటన జరిగింది. 


ఆయనే కారణం అంటూ గ్రామస్థుల ఆరోపణ..!


కృష్ణయ్య ఆంధ్రాబ్యాంకు కర్షక సేవా సహకార సంఘం డైరెక్టరుగా ఉన్నారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. రాజకీయ కక్షలే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. కృష్ణయ్య హత్యకు సీపీఎం నేత తమ్మిననేని వీరభద్రం సోదరుడు కోటేశ్వరరావు కారణం అంటూ తెల్దారుపల్లికి చెందిన పలువురు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే కోటేశ్వర రావు ఇంటిపై వారంతా దాడికి పాల్పడ్డారు. ఆయన ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు. దీంతో గ్రామంలో పెద్ద ఎత్తున పోలీసులు మొహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.  అలాగే తమ్మినేని కృష్ణయ్య హత్యకు కారణం అయిన వారి కోసం పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. డాగ్ స్క్వాడ్ తో పాటు క్లూస్ టీంను కూడా రంగంలోకి దించారు. 


ఇఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆందోళనకారులను అదుపు చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కోటేశ్వరరావు ఇంటిపై దాడి చేసిన వ్యక్తులు... తీవ్ర విధ్వంసం సృష్టించారు. ఏకంగా గ్యాస్ సిలిండర్‌తో ఆయన ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. 


కృష్ణయ్య మృతదేహాన్ని తమ్ముల నాగేశ్వరరావు నివాళి అర్పించారు. ఫ్యామిలీ మెంబర్స్‌కు ధైర్యం చెప్పారు. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేశారు.