Minister Jagadish Reddy Comments: మునుగోడు (Munugode Bypoll) ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. అక్కడ బీజేపీ మూడో స్థానంలో నిలుస్తుందని ఎద్దేవా చేశారు. చట్టబద్ధ సంస్థ అయిన ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ను రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ వాడుకుంటూ ఉందని మంత్రి ఆరోపించారు. అలాంటి ఈడీలు బోడీలు అంటూ బీజేపీ బెదిరింపులతో సీఎం కేసీఆర్‌ను లొంగదీసుకోవాలని చూస్తోందని అన్నారు. అలా చేయడం ఎవరి వల్లా సాధ్యం కాదని స్పష్టం చేశారు.
నల్గొండలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి మంత్రి జగదీష్ రెడ్డి (Minister Jagadish Reddy) ప్రారంభించారు. అలాగే మర్రిగూడ బైపాస్ జంక్షన్, క్లాక్ టవర్ సెంటర్‌ను కూడా మంత్రి ప్రారంభించారు. 100 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మునుగోడు అభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని అక్కడి ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని అన్నారు.
కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఇవే ఆఖరి ఎన్నికలు
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బ్రదర్స్‌కు ఈ మునుగోడు ఎన్నికలే ఆఖరి ఎన్నికలని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. రాజగోపాల్ రెడ్డికి మోదీ ఏకంగా రూ.22 వేల కోట్ల విలువైన కాంట్రాక్టు దక్కేలా చేశారని, అందుకే బీజేపీలోకి వెళ్తున్నారని అన్నారు. ఆ దన్నుతోనే రాజగోపాల్ రెడ్డి అహంకారంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీ దుర్మార్గాలను, ప్రధాని మోదీ అసమర్థ పాలనను ఎండగట్టేందుకు బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాలని పిలుపు ఇచ్చారు. అందుకోసం మునుగోడు ఉపఎన్నికలో వామపక్షాలు టీఆర్‌ఎస్‌తో కలిసి రావాలని కోరారు.
మోదీ ఇచ్చిన నరూ.22 వేల కోట్ల కాంట్రాక్టు కోసం నమ్మి బీఫాం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి, గెలిపించిన మునుగోడు ప్రజలకు ద్రోహం చేసిన స్వార్థపరుడు రాజగోపాల్‌రెడ్డి అని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. ఇటీవల మోదీ చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను చూసి ఓర్చుకోలేక ఫ్రీ స్కీమ్స్ పెట్టొద్దని మోదీ అనడం సిగ్గుచేటని అన్నారు. కుటుంబపాలన అంతా మీ ఇంట్లోనే ఉందని.. దొంగే దొంగా దొంగా.. అని అరిచినట్లుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీరు ఉందని మంత్రి ఎద్దేవా చేశారు.
రైతులకు మీటర్లు పెట్టిస్తావా
ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉంటే అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదని పదవికి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లి మునుగోడు రైతులకు మీటర్లు పెట్టిస్తావా అంటూ రాజగోపాల్‌రెడ్డిని మంత్రి జగదీశ్ రెడ్డి నిలదీశారు. ఈ నెల 20న టీఆర్ఎస్ పార్టీ మునుగోడులో నిర్వహించే ప్రజాదీవెన సభకు కార్యకర్తలు, ప్రజలు పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సూర్యాపేటలో స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి జగదీశ్ రెడ్డి Minister Jagadish Reddy సోమవారం పాల్గొన్నారు. ఆయనే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.