కేసీఆర్ ప్రధాని అవటం సాధ్యమేనా. ఇప్పుడిదే ప్రశ్న. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీతో జాతీయరాజకీయాల్లో అడుగుపెట్టారు. కానీ అంతకు ముందే చాలా గ్రౌండ్ వర్క్ చేశారు. పంజాబ్, ఢిల్లీ, బిహార్ ల్లో రైతులకు ఆర్థిక సహాయం చేశారు. పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బిహార్ సీఎం నితీశ్ కుమార్ వచ్చారు. అంతకు ముందే అప్పటి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, శరద్ పవార్ ఇలా కేసీఆర్ ఎన్డీఏకు వ్యతిరేకంగా కీలక నేతలందిరితో చర్చలు జరిపారు. కానీ ఇక్కడే ఆలోచించాల్సిందేంటంటే చర్చలు వేరు జతగా కలిసి రావటం వేరు. ముఖస్తుతి కోసమో, ముభావంగానో అందరూ ఎస్ ఉండాలి ప్రత్యామ్నాయ శక్తి కావాలి అంటారు. కానీ వాళ్లందరూ కలిసి వస్తారా. సరే వచ్చారనే అనుకుందాం అధికారంలోకి వస్తే సీటు ఎవరికి..హస్తిన రూటు ఎవరికీ ఇదే కదా సదరు రాజకీయాల్లో జరిగే చర్చ. 


ఈ రోజు జరిగిన బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ మీటింగ్ నే తీసుకుందాం. టీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ మీటింగ్ జేడీఎస్ నేత మాజీ సీఎం కుమారస్వామి సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు చాలా మందే వచ్చారు. మరికొంత మంది ఇతర రాష్ట్రాల నాయకులు కూడా హాజరయ్యారు. పనిలో పనిగా కుమారస్వామి తానొచ్చిన పని కూడా చెప్పేశారు. అదేంటంటే కర్ణాటకలో బీఆర్ఎస్ తో కలిసి ఎన్నికలకు వెళ్తాం అని. అర్థమైందిగా కర్ణాటక లో బీఆర్ఎస్ నేరుగా పోటీ చేయదు. మిత్రపక్షంతో కలిసి వెళ్తుంది. అలాగే మిగిలిన రాష్ట్రాల్లో కూడా అక్కడి నేతలను ఒప్పించినా అక్కడ కూడా మిత్రపక్షాలకే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఓ ప్రత్యామ్నాయ కూటమిగా ఫాం కాగలరు కానీ...నేరుగా అధికార పీఠాన్ని అధిష్టించగలిగే పార్టీగా మాత్రం అవతరించలేరు. 


ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు కేసీఆర్ కంటే ముందు తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన వ్యక్తులు. నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్ హోదాల్లో నేషనల్ పాలిటిక్స్ ను చక్రం తిప్పినట్లు తిప్పారు. కానీ అప్పుడు కూడా జాతీయస్థాయి అధికారానికి దూరంగానే నిలబడి జస్ట్ కింగ్ మేకర్స్ లా వ్యవహరించారు తప్ప...కింగ్ లు కాలేదు. మరి కేసీఆర్ కింగ్ కావాలనుకుంటున్నారా..లేదా కింగ్ మేకర్ లా నిలబడాలనుకుంటున్నారా. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో నేరుగా ఉండి అధికారాన్ని తీసుకోకపోతే....ఆయన అనుకున్న మార్పు సాధ్యమేనా. అసలు సాలిడ్ జాతీయ పార్టీలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ ను కాదని ఈ తృతీయ కూటమి వైపు ప్రజలు నిలబడే అవకాశం ఉందా. ఈ రోజు కైతే ఇవన్నీ ప్రశ్నలే. కానీ ఇవన్నీ కలిసే కేసీఆర్ భవిష్యత్తులో ప్రధాని కాగలరా అనే క్వశ్చన్ కు మిలియన్ డాలర్ల ప్రైజ్ ను ఆపాదిస్తున్నాయి.