టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని నేడు దసరా పర్వదినం సందర్భంగా ప్రకటిస్తున్నందున ప్రగతి భవన్, తెలంగాణ భవన్‌లు సందడిగా మారాయి. మరోవైపు, హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఫ్లెక్సీల హడావుడి నెలకొంది. టీఆర్ఎస్ కి చెందిన నేతలు న‌గ‌రంలో వివిధ ప్రాంతాల్లో భారీ బ్యాన‌ర్లు, కేసీఆర్ కటౌట్లను ఏర్పాటు చేశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఇప్పటికే (అక్టోబరు 5 మధ్యాహ్నం 12 గంటలు) మొదలైన పార్టీ స‌ర్వస‌భ్య స‌మావేశం నేపథ్యంలో టీఆర్ఎస్ నేత‌లు ఈ పోస్టర్లు ఏర్పాటు చేశారు.


తొలుత రెండ్రోజుల నుంచి నగరంలో ఫ్లెక్సీల హడావుడి కనిపించింది. కేసీఆర్ నివాసం ప్రగతి భవన్ నుంచి కేబీఆర్ పార్కు వరకూ అక్కడక్కడ కూడళ్లలో హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించారు. ‘దేశ్ కీ నేత కేసీఆర్’ అని కీర్తి్స్తూ గుండ్రని ఫ్లెక్సీలు, హోర్డింగులు పెట్టించారు. ఇక నేడు తెలంగాణ భవన్ ప్రాంతమే కాకుండా కేబీఆర్ పార్కు చుట్టూ దేశ్ కీ నేత అనే ఫ్లెక్సీలే కనిపించాయి. బేగంపేట, అమీర్ పేట్, సనత్ నగర్ ప్రాంతాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి.


బీజేపీ నేతృత్వంలోని కేంద్ర స‌ర్కార్ అమ‌లు చేస్తున్న విధానాల‌కు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ త‌నదైన శైలిలో పోరాటం మొద‌లు పెట్టిన సంగతి తెలిసిందే. విజ‌య ద‌శ‌మి వేళ నేడు కొత్త పార్టీని ప్రకటించనున్నందున కేసీఆర్‌కు శుభాకాంక్షలు చెబుతూ టీఆర్ఎస్ నేత‌లు సిటీలో పెద్ద సంఖ్యల్లో బ్యాన‌ర్లను ఏర్పాటు చేశారు. ఇవాళ మ‌ధ్యాహ్నం 1.19 నిమిషాల‌కు సీఎం కేసీఆర్ అత్యంత కీల‌క‌మైన ప్రక‌ట‌న చేయ‌నున్నారు. దేశ ప్రగ‌తికి సంబంధించిన ఆ ప్రక‌ట‌న‌పై స‌ర్వతా ఆస‌క్తి నెల‌కొంది.


నేడు (అక్టోబరు 5) తెలంగాణ భవన్‌లో జరిగే జనరల్ బాడీ మీటింగ్ లో పార్టీ పేరు మార్పుపై అధ్యక్షుడు కేసీఆర్‌ తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. దానికి పార్టీలో ఉన్న 283 మంది సభ్యులు ఏకగ్రీవ  ఆమోదం తెలుపుతారు. ముందుగా అనుకున్న ముహూర్తం ప్రకారం.. మధ్యాహ్నం 1.19 గంటలకు సదరు ఏకగ్రీవమైన తీర్మానంపై కేసీఆర్‌ సంతకం చేయనున్నారు. అనంతరం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి తాము ఆమోదించిన తీర్మానం గురించి ప్రకటన చేస్తారని తెలుస్తోంది.


ఈ తీర్మానం ప్రతిపాదన, ఆమోదం, ఎవరెవరు ప్రసంగించాలనే అంశాలను నిర్ణయించేందుకు మంగళవారం ప్రగతి భవన్ లో కేసీఆర్ పార్టీ కీలక నేతలతో సమావేశం అయ్యారు. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, మంత్రులు హరీశ్‌రావు, మహమూద్‌ అలీ, పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు (కేకే), ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


అక్టోబరు 6న ఢిల్లీకి
భారత్‌ రాష్ట్ర సమితిగా పార్టీ పేరు మార్పు నిర్ణయంపై చేసిన తీర్మానం ప్రతితో వినోద్‌కుమార్‌ సహా ఇతర కీలక నేతలు 6న ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి పార్టీ పేరు మార్పుపై చేసిన తీర్మానానికి ఆమోదం కోరుతూ అఫిడవిట్‌ ఇస్తారు. దానిపై కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది. పార్టీ పేరుపై అభ్యంతరాలుంటే తెలిపేందుకు 30 రోజుల టైం ఇస్తుంది. ఏవీ రాకపోతే దాన్ని ఆమోదించేస్తుంది.