టెక్నాలజీ మంచి పనికి ఎంతగా ఉపయోగపడుతోందో, చెడుకూ అలాగే తోడ్పడుతోంది. నేరగాళ్లు తప్పుడు పనులు చేసేందుకు బాగా అక్కరకు వస్తోంది. తాజాగా హైదరాబాద్ లో యూట్యూబ్‌లో వీడియోలు చూసి ఫేక్ కరెన్సీ ఎలా తయారు చేయాలో కొంత మంది నేర్చుకున్నారు. అందులోని సూచనల ప్రకారం నకిలీ కరెన్సీ తయారు చేయడం నేర్చుకున్న వ్యక్తులు వాటిని మార్కెట్ లో ఎవరికీ అనుమానం రాకుండా చెలామణి చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా వీరు చేస్తున్న మోసం చాలా ఆలస్యంగా బయట పడింది. హైదరాబాద్ శివారులోని మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ముఠా నేరాలు వెలుగులోకి వచ్చాయి.


మైలార్‌ దేవ్‌ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన వివరాలను మంగళవారం (అక్టోబరు 5) రాజేంద్రనగర్‌ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో ఏసీపీ గంగాధర్‌ రెడ్డి, మైలార్‌ దేవ్‌ పల్లి సీఐ మధు ప్రెస్ మీట్ నిర్వహించి వివరించారు. నిందితులు నకిలీ రూ.500, రూ.200, రూ.100 నోట్లను యూట్యూబ్ లో చూసి తయారు చేశారు. దాదాపు రూ.లక్ష రూపాయలు విలువ చేసే కరెన్సీని వీరు నకిలీగా తయారు చేసి మార్కెట్లోకి వదిలారని పోలీసులు చెప్పారు.


నల్గొండ జిల్లా నాంపల్లి మండలం, గౌరారానికి చెందిన బ్యాగరి అడమ్‌ అనే 38 ఏళ్ల వ్యక్తి వనస్థలిపురంలో ఉంటూ లారీ డ్రైవర్‌గా పని చేస్తూ ఉన్నాడు. అతని ఫ్రెండ్స్ తో పాటు మరో ఇద్దరు డ్రైవర్లు బి. భరత్‌ కుమార్‌ (35), బి. శంకర్‌ (42) కలిసి డబ్బుకు అత్యాశ పడ్డారు. తేలిగ్గా సులభంగా డబ్బు సంపాదించాలని నేరం వైపు మళ్లారు. ప్రధాన సూత్రధారి అయిన అడమ్‌ బ్యాగరి మార్గనిర్దేశనంలో ముగ్గురు కలిసి యూట్యూబ్‌లో నకిలీ కరెన్సీ ఎలా తయారు చేయవచ్చో చూశారు. దాని ప్రకారం ప్రాక్టీస్ చేసి ఫేక్ కరెన్సీ నోట్లు తయారు చేసే విధానాన్ని నేర్చుకున్నారు. 


మేలు రకం బ్రాండెడ్ కలర్ ప్రింటర్‌ కొనుగోలు చేశారు. దాని ద్వారా అయితే, తేలికగా కరెన్సీ నోట్లు నాణ్యంగా వస్తాయని భావించారు. అయితే, అందుకోసం ప్రత్యేక కాగితం కావాలి కాబట్టి మరో ఇద్దర్ని సంప్రదించారు. ఆ క్రమంలో వారికి సహకరించడానికి నల్లకుంటలో స్టేషనరీ షాపు నడుపుతున్న ఎం.మాధవ గౌడ్‌, వనస్థలిపురానికి చెందిన స్టాంపు పేపర్లు విక్రేత వి.వీర వెంకటదుర్గ మణికంఠం నాయుడి సహకారం కోరారు. డబ్బులకు ఆశ పడి వారు కూడా ఈ నేరంలో పాలుపంచుకున్నారు.


అందరూ కలిసి రూ.500, 200, 100 నకిలీ కరెన్సీ నోట్లను తయారు చేశారు. అంతా కలర్ ప్రింటర్ సాయంతోనే ఈ నకిలీ డబ్బులను తయారు చేశారు. అలా దాదాపు కక్కుర్తి కొద్దీ లక్ష రూపాయలు విలువ వరకూ కరెన్సీని తయారు చేశారు. ఇక ఆ డబ్బులను మార్కెట్లో చెలామణి చేయడానికి అడమ్‌, భరత్‌ కుమార్‌, శంకర్‌లు కాటేదాన్‌కు వచ్చారు. నోట్లను మార్చేందుకు ప్రయత్నిస్తుండగా మైలార్‌ దేవ్‌ పల్లి పోలీసులు, మాదాపూర్‌ ఎస్వోటీ పోలీసులకు అప్పటికే వారి కదలికలపై విశ్వసనీయ సమాచారం అందరడంతో ముందస్తు ప్రణాళిక ప్రకారం దాడి చేసి పట్టుకున్నారు. మొత్తానికి వారి నుంచి లక్ష రూపాయల నకిలి కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ప్రెస్ మీట్ లో కేసు వివరాలు చెప్పే సమయంలో నిందితులు తయారు చేసిన నకిలీ కరెన్సీ నోట్లను కూడా పోలీసులు చూపించారు.