ఇన్ని రోజులు తన తెలంగాణ గడ్డ, తెలంగాణ ప్రజలు అని చెప్పుకునే సీఎం కేసీఆర్ కు రాష్ట్రంతో ఉన్న బంధం తెగిపోయిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. గత కొన్ని రోజులుగా చెప్పినట్లే.. ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ ను జాతీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి (BRS) గా కేసీఆర్ ప్రకటించారు. జాతీయ పార్టీగా మారుస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయగా, పార్టీ జనరల్ బాడీ ఆమోదం తెలిపింది. పార్టీ సర్వసభ్య సమావేశం చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని కేసీఆర్ చదివి వినిపించారు. కేసీఆర్ బీఆర్ఎస్ ప్రకటన అనంతరం హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉద్యమ పార్టీని ఖతం పట్టించిన కేసీఆర్
బీఆర్ఎస్ పార్టీ ప్రకటనతో తెలంగాణకు, ఉద్యమ నేత సీఎం కేసీఆర్ కు ఉన్న బంధం తెగిపోయిందన్నారు. ఉద్యమ పార్టీని ఖతం పట్టించి, ఉద్యమకారులను మరిచిపోయేటట్టు చేశారని కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఉద్యమ చరిత్ర లేకుండా చూసేందుకు, తన ముద్ర ఉండే పార్టీ బీఆర్ఎస్ ని కేసీఆర్ స్థాపించారని విమర్శించారు. జాతీయ పార్టీ బీఆర్ఎస్ స్థాపనతోనే తెలంగాణకి కేసీఆర్ కు ఉన్న బంధం పూర్తిగా తెగిపోయిందని, రాష్ట్ర ప్రజానీకానికి టీఆర్ఎస్ పార్టీకి ఉండే బంధం తెగిపోయిందన్నారు. రాష్ట్ర సాధనలో పాలు పంచుకున్న తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ చైతన్యానికి కేసీఆర్ కి ఉన్న బంధం తెగిపోయిందని వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే ఈటల.
కూట్లో రాయి తీయలేనివాడు ఎట్లో రాయి తీస్తాడా !
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యలు పరిష్కరించలేనివాడు, పలు వర్గాల ప్రజల విశ్వాసం కోల్పోయి ఇబ్బంది పడుతున్నప్పుడు.. ఆ సంప్రదాయాన్ని ఆ దుఃఖాన్ని దేశం మీద రుద్దే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని ఆరోపించారు. తాను చెప్పేదాంట్లో ఒకటి మాత్రం నిజమని.. కూట్లో రాయి తీయలేనివాడు, ఎట్లో రాయి తీయడానికి పోయినట్టు ఉంది అంటూ జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ రంగప్రవేశాన్ని ఎద్దేశా చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరువాత కేసీఆర్ నమ్ముకున్నది కేవలం మద్యం, డబ్బును మాత్రమేనన్నారు. అక్రమంగా సంపాదించుకున్న డబ్బుతో దేశంలో చక్రం తిప్పేందుకు వెళ్తున్నానంటూ కేసీఆర్ పగటి కలలు కంటున్నారని, అది కలగానే మిగిలిపోతుందని బీజేపీ నేత ఈటల అన్నారు.
టీఆర్ఎస్ చరిత్ర ముగిసినట్లేనా !
తెలంగాణ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. భారత్ రాష్ట్ర సమితిగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. జాతీయ పార్టీగా మారుస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. 21 ఏండ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో మలుపు చోటు చేసుకుంది. పలు రాష్ట్రాల నేతల సమక్షంలో కేసీఆర్ ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) గా ఉన్న పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మార్చడంతో పాటు టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ పార్టీ కార్యవర్గం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులందరూ ఆమోదించారు. దీంతో మధ్యాహ్నం 1.19 గంటలకు బీఆర్ఎస్ పార్టీ పేరును ప్రకటించారు.