Supreme Task Force: కోల్‌కతాలో వైద్యురాలిని అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై యావత్ దేశం భగ్గుమంది. వైద్యులంతా విధులను బహిష్కరించి రోడ్లపైకి వచ్చారు. ప్రజల ప్రాణాలు కాపాడే తమకు భద్రత ఏదని ప్రశ్నించారు. ఆసుపత్రిలోనే రక్షణ లేకపోతే ఎలా పని చేయాలని నిలదీశారు. జరుగుతున్న పరిణామాలు గమనించిన సుప్రీంకోర్టు కీలక ఈ కేసును సూమోటుగా తీసుకుంది. విచారణ చేపట్టి కీలక నిర్ణయం తీసుకుంది. 


కేసు విచారణపై ఆరా


కోల్‌కతా ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు అసలు అలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు జరిగిన తర్వాత విచారణ ఎందుకు సరిగా జరగలేదని ప్రశ్నించింది. పోలీసులు, ఆసుపత్రి ప్రిన్సిపాల్ ఏమయ్యారని నిలదీసింది. ఈ కేసు విచారణ జరుగుతున్న తీరు ఇప్పటి వరకు గుర్తించిన అంశాలు కోర్టుకు వివరించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది.  


వైద్యుల భద్రతపై చర్చ


ఈ కేసు విచారణ సందర్భంగా ఎప్పటి నుంచో ఉన్న ఓ పెద్ద సమస్యను చర్చకు పెట్టింది సుప్రీంకోర్టు. వైద్యుల భద్రత, వారి పని వాతావరణం ఇతర అంశాలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి వాటికి పరిష్కారా మార్గాలను చూపేందుకు ఓ నేషనల్ టాస్క్‌ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. జాతీయస్థాయిలో పేరున్న వైద్యులను ఈ టీంలో నియమించింది. ఇప్పుడు వాళ్లంతా దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారా మార్గాలను సూచించనున్నారు. 


పది మందితో టాస్క్‌ఫోర్స్


పది మంది టాస్క్‌ఫోర్స్‌కు ఛైర్మన్‌గా వైస్ అడ్మిరల్ డా. ఆర్కే సరైన్ ఉంటారు. తర్వాత దేశంలోనే గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యునిగా గుర్తింపు తెచ్చుకున్న ఏఐజీ ఛైర్మన్‌ అయిన నాగేశ్వర్‌రెడ్డి ఇందులో సభ్యునిగా ఉన్నారు. తర్వాత ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డా. ఎం. శ్రీనివాస్, బెంగళూరు NIMHANS వైద్యులు డా. ప్రతిమమూర్తి, డాక్టర్ గోవర్దన్ దత్తపురి, డాక్టర్ సౌమిత్రారావత్, డాక్టర్ పద్మ శ్రీవాస్తవ, ఈ టీంలో కీలక సభ్యులుగా పని చేయనున్నారు. వీళ్లకు సుప్రీంకోర్టు మూడు వారాల్లో మధ్యంతర నివేదిక ఇవ్వాలని పూర్తి నివేదికను రెండు నెలల్లో ఇవ్వలాని సూచించింది. దేశంలోని అన్ని వర్గాలను సంప్రదించి నివేదిక తయారు చేయాలని తెలిపింది. 


యువలాయర్ చొరవతో చర్చ


అపరాజిత ఆనే లాయర్ ఇచ్చిన వివరాలతో ఈ కీలక నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు. ఆర్జీ కర్‌ ఆస్పత్రిలో వైద్యురాలని హత్యచారం తర్వాత జరిగిన పరిణామాలు అందులో వివరించారు. ఆమె చనిపోయిన తర్వాత ఆసుపత్రి వద్ద పరిస్థితులు అదుపు తప్పాయని సిబ్బందిపై దాడులు జరిగాయని తెలిపారు. పోలీసులు రక్షణ కల్పించినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని వైద్యులు, సిబ్బందిపై దాడులకు ఆందోళనకారులు దిగారన్నారు. వైద్యులు, సిబ్బంది ఆవేదన కోర్టుకు తెలియజేయడానికే ఈ వివరాలు సీల్డ్ కవర్‌లో పెట్టి అందజేసినట్టు ప్రొటెక్ట్‌ ది వారియర్స్‌ తరఫున అపరాజిత అనే న్యాయవాది సీజేఐ ధర్మాసనానికి అందజేశారు. 


అపరాజిత్ అందజేసిన వివరాలు పరిశీలించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి... ఆస్పత్రిలో పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఇలాంటి దాడులు పెరిగిపోయాయని అన్నారు. చాలా ప్రాంతాల్లో వైద్యులు ఎక్కువ పని గంటలు వర్క్ చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వాసుపత్రుల్లో ఈ పరిస్థితి దారుణంగా ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇలాంటి వాటిని తగ్గించేందుకే ఈ టాస్క్ ఫోర్స పని చేస్తుందని పేర్కొన్నారు. 


నాగేశ్వర్‌రెడ్డి ఎవరు ?


ఇలాంటి కీలకమైన టాస్క్‌ఫోర్స్‌లో నాగేశ్వర్‌రెడ్డి భాగమవ్వడం ఆయనకున్న ప్రాధాన్యత తెలియజేస్తోంది. కోట్ల రూపాయల విలువైన సంపాదనను వదులుకొని స్వదేశంలోనే సేవలు అందించాలన్న లక్ష్యంతో హైదరాబాద్‌లో ఆసుపత్రి ఏర్పాటు చేశారు. ఏఐజీ పేరుతో ఆసుపత్రి స్థాపించి ఎందరికో సేవలు అందిస్తున్నారు. విదేశాల్లో వచ్చిన ఆఫర్స్ వదులుకున్న ఆయన వద్ద ఇప్పుడు విదేశీ వైద్యులు కూడా ట్రైనీలుగా చేరుతున్నారు. 


నాగేశ్వర్‌రెడ్డిని తీసుకోవడానికి కారణమేంటి?


వైద్యం అనేది సామాజిక బాధ్యతని చెబుతుంటారు నాగేశ్వర్‌రెడ్డి. అందుకే ఈ వృత్తిలోకి ఎందుకు రావాలని అనుకుంటున్నామో అనేది ముందే నిర్ణయించుకోవాలని నేటి తరానికి చెబుతుంటారు. అందరూ వైద్య వృత్తి చదివిన వారంతా వైద్యులుగానే మారుతున్నారని ఎవరూ పరిశోధన వైపు వెళ్లడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. కేన్సర్‌ చికిత్స కోసం భారీగా ఖర్చుపెట్టే ప్రభుత్వాలు దాని మందు కనిపెట్టేందుకు మాత్రం అంత ఖర్చు చేయకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. వ్యాక్సిన్ కనిపెడితే ఈ ఖర్చు తగ్గిపోతుందని ఆయన భావన. 


మంచి వైద్యానికి డబ్బు అవసరమంటున్న నాగేశ్వరరెడ్డి, మంచి డాక్టర్లకు వేతనాలు ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుందంటారు. అందుకే మొత్తం వైద్యాన్ని ప్రభుత్వం ఎప్పుడూ ఫ్రీగా ఇవ్వలేదని చెబుతుంటారు. తరచూ వైద్యులపై జరిగే దాడులను కూడా తన ప్రసంగాల్లో ప్రస్తావిస్తుంటారు. వైద్యులు అంటే బాగా డబ్బులు సంపాదిస్తారని.. డబ్బు కోసమే వైద్యం చేస్తారనే భావమే ప్రజల్లో ఉందని దాని కారణంగానే దాడులు జరుగుతుంటాయని అంటారు. ఈ విషయంలో మార్పు రావాలంటే మాత్రం వైద్యులే చొరవ తీసుకోవాల్సి ఉంటుందంటారు. సామాజిక బాధ్యత కలిగిన వైద్యునిగా గుర్తింపు ఉన్న నాగేశ్వర్‌రెడ్డిని సుప్రీంకోర్టు కీలకమైన టాస్క్‌ఫోర్స్‌లో భాగం చేసింది.