Rains In Telangana and Hyderabad: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం తెలంగాణపై కూడా కనిపిస్తోంది. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు తెలంగాణ ముంచెత్తాయి. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్‌, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కరీంనగర్, భూపాలపల్లి, నిజామాబాద్, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరిక జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో పరిస్థితి సాధారణంగానే ఉంటుందని పేర్కొంది. 


శుక్రవారం తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లోల వర్షాలు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.77 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఈ సీజన్‌లో సాధారణంగా రాష్ట్రంలో కురవాల్సిన దాని కంటే దాదాపు ఆరు సెంటిమీటర్లు ఎక్కువ కురిసింది. 


హైదరాబాద్‌లో వాతావరణం 
హైదరాబాద్‌లో రెండు రోజులుగా వర్షాలు పడుతున్నాయి. రాత్రి నుంచి హైదరాబాద్‌ వ్యాప్తంగా తుంపర్లు పడుతూనే ఉన్నాయి. దీని ప్రభావంతో హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. శుక్రవారం గరిష్ఠ ఉష్ణోగ్రత 28.2డిగ్రీలుగా కనిష్ఠ ఉష్ణోగ్రత 23.1డిగ్రీలుగా రిజిస్టర్ అయింది. 


ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణా, గోదావరి నదులుల్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంది. జూరాల ప్రాజెక్టు నుంచి 37,905 క్యూసెక్కుల నీటిని  శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలోకి 32 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రిజిస్టర్ అవుతోంది. ఆలమట్టికి వస్తున్న వరద నీటిని కూడా దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్‌ జలాశయం నుంచి 68 వేల క్యూసెక్కులు జూరాలకు రిలీజ్ చేస్తున్నారు. 
గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండటంతో కాళేశ్వరం ప్రధాన బ్యారేజీ మేడిగడ్డలోకి భారీగా వరదనీరు చేరుతోంది. మేడిగడ్డలోకి 3.41 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా... అదే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.