Hyderabad News: తెలంగాణలోని ఓ రెస్టారెంట్‌లో అత్యంత అసహ్య కరమైన, జుగుప్సాకరమైన పరిణామం చోటు చేసుకుంది. ఓ రెస్టారెంట్‌లో తినుబండారాలను వారు వండిన తీరుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. ఆ రెస్టారెంట్ కు చెందిన టాయ్‌లెట్‌లో తినుబండారాలను కడగడం చూసిన కస్టమర్లు అవాక్కయ్యారు. మహ్మద్ జాఫర్ ఖాన్ అనే గుర్తింపు పొందిన చెఫ్ ఈ పని చేసినట్లుగా గుర్తించారు. కనీసం ప్రాథమిక పరిశుభ్రత పాటించకుండా అసహ్యకరమైన రీతిలో ఆహారాన్ని బాత్‌రూంలో కడుగుతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఆ వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది. 


మహ్మద్ జాఫర్ ఖాన్.. అతను పనిచేస్తున్న రెస్టారెంట్‌లోని మూత్రశాలలు, టాయిలెట్లలో ఆహారాన్ని మ్యారినేట్ చేయడం చూసి అక్కడికి వెళ్లిన కస్టమర్లు ఖంగుతిన్నారు. అయితే, ఈ వీడియో ఏ రెస్టారెంట్‌కు చెందినదనే విషయంపై స్పష్టత లేదు. ఆ చెఫ్ రెస్టారెంట్ రెస్ట్‌ రూంలను తాత్కాలిక ఫుడ్ మ్యారినేటింగ్ కేంద్రాలుగా ఉపయోగించడం ద్వారా పరిశుభ్రత, భద్రత అనే రెండు ప్రాథమిక నియమాలను ఉల్లంఘించారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 


‘‘బిర్యానీ ఉస్మే పకాతే హై (బిర్యానీ అక్కడ వండుతావా).. బిర్యానీ ఉస్మే వాష్ కర్తే హై (అక్కడ శుభ్రం చేస్తావా)..’’ అని కస్టమర్లు నిలదీశారు. ఇలా ప్రశ్నిస్తున్నప్పుడు మరో కస్టమర్ ఈ వీడియోను రికార్డ్ చేశారు. పైగా ఆ రెస్టారెంట్‌లోని అపరిశుభ్రమైన టాయిలెట్లు ఎంత దారుణంగా ఉన్నాయో చూడొచ్చు. 


ఈ వీడియోను వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది నెట్టింట్లో వైరల్‌గా మారింది. అది చూసిన వారంతా ఆగ్రహంతో అసహనం వ్యక్తం చేశారు. వారు ఆ ఆరాచకాన్ని ఖండించారు. భవిష్యత్తులో ఇలాంటి విశ్వాస ఉల్లంఘనలను నివారించడానికి కఠినమైన ఆడిట్‌లు, సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేశారు.


ఒక నెటిజన్ ఇలా కామెంట్ చేశాడు, ‘‘ఓహ్ గాడ్.. ఇది ఇప్పుడు చాలా దూరం వెళ్తుంది. దయచేసి సంబంధిత అధికారులు కఠినమైన మార్గదర్శకాలు విడుదల చేయండి. ఇక బయట తినడం చాలా కష్టం అవుతుంది’’ అని కామెంట్ చేశారు.