Government Officials Filed For Anticipatory Bail: హైదరాబాద్‌ (Hyderabad) నగరంలో 'హైడ్రా' (HYDRA) దూకుడు కొనసాగుతోంది. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. అటు, అక్రమ నిర్మాణాలకు అనుమతిచ్చిన అధికారులపైనా ప్రభుత్వ ఆదేశాలతో చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. అనుమతులకు సంబంధించి పలువురు ప్రభుత్వ అధికారులపై.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Ranganath) సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగానికి ఫిర్యాదు చేశారు. పలు చోట్ల అక్రమ నిర్మాణాల కూల్చివేతల సందర్భంగా అనుమతుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో 'హైడ్రా' ఫిర్యాదు మేరకు సైబారాబాద్ ఆర్థిక విభాగం పోలీసులు.. చందానగర్, బాచుపల్లిలోని ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు చేపట్టారు. వారిపై కేసులు నమోదు చేశారు. దీంతో ఆ ప్రభుత్వ అధికారులు తాజాగా ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. బాచుపల్లి ఎమ్మార్వో పూల్ సింగ్, లాండ్ అండ్ రికార్డ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్ ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానంలో దరఖాస్తు చేశారు. అయితే, వారికి బెయిల్ ఇవ్వొద్దంటూ ఆర్థిక విభాగం పోలీసులు కోర్టును కోరారు.


హైడ్రా కమిషనర్ కీలక ప్రకటన


కాగా, నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో చేపడుతున్న కొత్త నిర్మాణాలను మాత్రమే కూల్చేస్తున్నట్లు తెలిపారు. అయితే, ఇంతకు ముందే ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన వాటిని కూల్చివేయడం లేదన్నారు. ముఖ్యంగా నివాస కట్టడాలను కూల్చమని.. నోటీసులు మాత్రమే ఇచ్చామని వెల్లడించారు. కొత్త అపార్ట్‌మెంట్స్, ఇళ్లు, ప్లాట్స్, భూమి కొనుగోలు చేసే సమయంలో అది నిబంధనల మేరకే ఉన్నాయో లేదో చెక్ చేసుకొని కొనుగోలు చేయాలని ప్రజలకు సూచించారు. గతంలో నోటీసులు ఇచ్చిన అక్రమ కట్టడాలనే మొదటగా హైడ్రా కూల్చివేస్తోందని స్పష్టం చేశారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో ఉన్న నివాస కట్టడాలను, ఇప్పటికే నివాసం ఉంటున్న భవనాల జోలికి హైడ్రా వెళ్లడం లేదన్నారు. అయితే ఇలాంటి స్థలాల్లో ఇళ్లు గానీ, స్థలాలు గానీ కొనుగోలు చేయవద్దని వివరించారు. రంగనాథ్ ప్రకటనతో ఇప్పటికే ఇళ్ల నిర్మాణం పూర్తై, అందులో నివాసం ఉంటున్న యజమానులకు భారీ ఊరట కలిగింది.


Also Read: Telangana High Court: తెలంగాణలో ఉపఎన్నికలు వస్తున్నాయ్!-హైకోర్టు తీర్పుపై బీఆర్‌ఎస్ రియాక్షన్ ఇదే