సాధారణంగా తమకు తెలియకుండా బ్యాంకు ఖాతాల్లోకి వేల రూపాయలు జమ అయినా సంతోష పడుతుంటారు. అలాంటిది ఏకంగా ఓ వ్యక్తి బ్యాంకు ఖాతాలో రూ.18.5 కోట్ల నగదు జమ కావడం సంచలనంగా మారింది. ఇటీవల తమిళనాడులో పలువురి హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాల్లో భారీగా నగదు జమ కాగా, తాజాగా తెలంగాణలో ఇలాంటి ఘటన జరిగింది. అయితే బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ కావడంతో బాధితుడు లబోదిబో మంటున్నాడు. వెంకట్ రెడ్డికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అకౌంట్‌లో రూ. 18.52 కోట్ల మేర నగదు జమ అయింది. ఉన్నఫళంగా తన బ్యాంకు ఖాతాలో కోట్ల రూపాయలు జమ అయినట్లు బ్యాంక్ అధికారులకు సమాచారం ఇచ్చారు వెంకట్ రెడ్డి. 


బ్యాంకు అధికారులు అప్రమత్తం
ఇటీవల తమిళనాడులో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాల్లో నగదు అడ్డగోలుగా జమ కావడం, తెలంగాణలోనూ ఇలాంటి ఘటన వికారాబాద్‌లో జరగడంతో బ్యాంకు అధికారులు అప్రమత్తం అయ్యారు. తన బ్యాంకు ఖాతాలో పద్దెనిమిదిన్నర రోట్లు జమ అయినట్లు వెంకట్ రెడ్డి సమాచారం అందించగానే ఆయనకు చెందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అకౌంట్‌ను అధికారులు ఫ్రీజ్ చేశారు. సాంకేతిక సమస్యతోనే ఇలా జరిగిందని బ్యాంక్ సిబ్బంది చెబుతున్నారు. కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసే క్రమంలో టెక్నికల్ ప్రాబ్లమ్ తలెత్తి, వెంకట్ రెడ్డి ఖాతాలో నగదు జమ అయిందని  అధికారులు తెలిపారు. 


బాధితుడు ఆవేదన..
ఏటీఎంకు వెళ్లి స్టేట్‌మెంట్ చూసుకుంటే రావడం లేదని, మనీ విత్ డ్రా చేసుకుందామని చూస్తే కూడా ప్రయోజనం లేదని అకౌంట్ హోల్డర్ వెంకట్ రెడ్డి తెలిపారు. ఆన్ లైన్ బ్యాంకింగ్‌లో చెక్ చేస్తే అకౌంట్‌లో కోట్ల రూపాయాలు జమ అయినట్లు కనిపిస్తోందని, కానీ కనీసం తన నగదు కూడా విత్ డ్రా చేసుకోవడం, మనీ ట్రాన్సాక్షన్స్ చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తెలిసిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సిబ్బందికి కాల్ చేసి తన బ్యాంకు ఖాతాలో రూ.18 కోట్ల పైగా నగదు జమ అయిందని, అవి తన డబ్బులు కాదని తెలిపినట్లు చెప్పారు. 


ఆదివారం కావడంతో సిబ్బంది చేసిన ఫోన్ కాల్‌కు మేనేజర్ స్పందించలేదని, కస్టమర్ కేర్‌కు కాల్ చేస్తే తమ వద్ద సమాచారం లేదని చెప్పారని బాధితుడు తెలిపారు. సోమవారం నాడు ఆధార్ కార్డ్, ఐడీ ప్రూఫ్ లాంటి కొన్ని డాక్యుమెంట్ సమర్పించాలని సూచించారు. వేరే వాళ్ల డబ్బుల విషయాన్ని పక్కనపెడితే, తన ఖాతాలో ఉన్న సొంత నగదు కూడా వాడుకోకుండా బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేశారని వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.


Also Read: Planadu Road Accident: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం - దైవ దర్శనానికి వెళ్లొస్తూ మృత్యుఒడికి


Also Read: Minister Mallareddy : రెడ్ల సింహ గర్జనలో ఉద్రిక్తత, మంత్రి మల్లారెడ్డి వాహనంపై రాళ్ల దాడి