Minister Mallareddy : రెడ్ల సింహ గర్జనలో ఉద్రిక్తత, మంత్రి మల్లారెడ్డి వాహనంపై రాళ్ల దాడి

ABP Desam   |  Satyaprasad Bandaru   |  29 May 2022 10:38 PM (IST)

Minister Mallareddy : మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లోని నిర్వహించిన రెడ్ల సింహ గర్జన సభలో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి మల్లారెడ్డి ప్రసంగాన్ని కొందరు అడ్డుకున్నారు.

మంత్రి మల్లారెడ్డి వాహనంపై దాడి

Minister Mallareddy : మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లో జరిగిన రెడ్ల సింహ గర్జనలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంత్రి మల్లారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి సీఎం కేసీఆర్ ను పొడుగుతుండడంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని చెప్పడంతో సభకు వచ్చిన వాళ్లు మండిపడ్డారు. పదే పదే టీఆర్ఎస్, కేసీఆర్ పేరెత్తడంతో కుర్చీలు పైకి లేపి వ్యతిరేక నినాదాలు చేశారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతుండగా కొందరు రాళ్ళు విసిరేందుకు ప్రయత్నించారు. దీంతో మల్లారెడ్డి మధ్యలోనే ప్రసంగం ఆపేసి వెళ్లిపోయారు. మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్ పై కొందరు కుర్చీలు, రాళ్లు విసిరేశారు. 

పోలీసులు వలయంగా ఏర్పడి 

మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌లో ఆదివారం సాయంత్రం రెడ్ల సింహగర్జన బహిరంగ సభ జరిగింది. ఈ సభను రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు లక్ష్యంగా నిర్వహించారు. అయితే ఈ సభలో రెడ్ల జేఏసీ నేతలతో పాటు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై పొగడ్తలు కురిపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి మాట్లాడారు. ఈ క్రమంలో కొందరు మల్లారెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసిన మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో కొందరు మల్లారెడ్డి వాహన శ్రేణిపై కుర్చీలు, రాళ్లు విసిరారు. మంత్రి కాన్వాయ్‌ వెంట పరుగులు తీస్తూ కుర్చీలు, రాళ్లు విసరడంతో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.  పోలీసులు తాళ్లతో వలయంగా ఏర్పడి మంత్రి కాన్వాయ్‌కు రక్షణగా నిలిచారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య పోలీసుల సాయంతో మల్లారెడ్డి అక్కడి నుంచి సురక్షితంగా బయటపడ్డారు. 

"టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లో అభివృద్ధి జరిగింది. గ్రామాల్లో డంపింగ్ యార్డ్ , గ్రేవ్ యార్డ్, ట్రాక్టర్, ట్రాలీ ఇలా అన్ని సౌకర్యాలతో గ్రామాలను అందంగా తీర్చిద్దిద్దారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇలాంటి అభివృద్ధి చూశామా. టీఆర్ఎస్ ప్రభుత్వంలో పింఛన్లు, కల్యాణ లక్ష్మీ అన్నీ ఇస్తు్న్నారు. మీకు కూడా రెడ్ల కార్పొరేషన్ వస్తుంది. రెడ్ల కార్పొరేషన్ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే ఇస్తుంది. తప్పకుండా మేం చేయిస్తాం. "- -మల్లారెడ్డి, మంత్రి

Also Read : Kishan Reddy : అనాథపిల్లలకు ప్రధాన మంత్రే గార్డియన్, రేపు పీఎం కేర్స్ చిల్డ్రన్ పథకం ప్రారంభం- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 

Published at: 29 May 2022 09:50 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.