Hyderabad News: రామోజీరావు మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత దేశ మీడియా రంగం ఓ దిగ్గజాన్ని కోల్పోయిందని అన్నారు. ఈనాడు వార్తాపత్రిక, ఈటీవీ, ఫిల్మ్‌సిటీని స్థాపించి స్ఫూర్తి నింపారని ప్రశంసించారు. ఆయన సేవలకు గుర్తింపుగా పద్మ విభూషణ్ దక్కిందని వెల్లడించారు. మీడియాకి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీ రావు మృతి తెలుగు వారందరికీ పెద్ద లోటుగా అభివర్ణించారు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. "ఈనాడు వ్యవస్థాపకులు, ఆత్మీయులు రామోజీరావు గారు పరమపదించారని తెలిసి విచారించాను. క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధతలతో అడుగుపెట్టిన ప్రతి రంగంలో వారు సృష్టించిన నూతన ఒరవడి ఆదర్శనీయమైనది. తెలుగు భాష-సంస్కృతులకు వారు చేసిన సేవ చిరస్మరణీయమైనది. తెలుగు వారి వెలుగు, మార్గదర్శి అయినా ఈనాడు పత్రిక మరియు రామోజీ ఫిల్మ్ సిటీ ద్వారా ప్రపంచానికి తెలుగు వారి ఘనతను చాటిన వారి క్రాంతదర్శనం స్ఫూర్తిదాయకమైనది. రామోజీ రావు వ్యక్తి కాదు, శక్తివంతమైన వ్యవస్థ. వ్యక్తిగా మొదలై వ్యవస్థగా ఎదిగిన వారి జీవితం నుంచి యువతరం నేర్చుకోవలసిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. తెలుగు వారందరికీ గర్వకారణమైన రామోజీరావు లేని లోటు పూడ్చలేనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను."
తెలుగు ప్రజలు ఓ ఛాంపియన్‌ను కోల్పోయారు: జేపీ
స్వయంగా తనను తాను చెక్కుకొని ఎదిగిన దిగ్గజం రామోజీరావు మరణ వార్త తనను చాలా కలచి వేసిందన్నారు లోక్‌సత్తా వ్యవస్థాకులు జయప్రకాష్ నారాయణ. " రామోజీరావు మరణం తెలుగు సమాజానికి, భారతీయ జర్నలిజానికి తీరని లోటు. రాజీలేని, స్వీయ-నిర్మిత దిగ్గజం, అతను ఎల్లప్పుడూ నిర్భయ పోరాట పటిమ, అంకితభావం, ఆవిష్కరణ, సమగ్రత, విశ్వసనీయత, రైతుల, ప్రజా సంక్షేమం కోసం నిలబడ్డారి. దాదాపు అయిదు దశాబ్దాల పాటు మీడియా ప్రపంచంలో మహా శక్తిలా ఎదిగిన ఆయన తెలుగు మాట్లాడే ప్రజల ఆధునిక చరిత్రలో అంతర్భాగంగా నిలిచారు. తెలుగు ప్రజలు ఒక ఛాంపియన్‌ను కోల్పోయారు. జర్నలిజం ఒక యోధుడిని కోల్పోయింది. నేను గొప్ప స్నేహితుడిని కోల్పోయాను. ఆయన సేవలు, జ్ఞాపకాలు చిరకాలం నిలిచే ఉంటాయి. "
రామోజీరావు మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సంతాపం తెలియజేశారు. తెలుగు భాషకు ఆయన సేవలు మరువలేనివని అన్నారు. రామోజీరావు తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని పురందేశ్వరి అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల రామోజీ రావు మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
రామోజీరావు మృతి పట్ల రాహుల్ గాంధీ ప్రగాఢ సంతాపం తెలిపారు. భారతదేశ మీడియా రంగానికి ఆయన ఓ మార్గదర్శి అని కొనియాడారు. జర్నలిజం, సినిమా రంగాల్లో ఆయన వేసిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోదని వెల్లడించారు.