TGSRTC News: తెలంగాణ ఆర్టీసీలో నిబద్ధతతో పని చేసే ఉద్యోగులను సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఎల్లప్పుడూ గుర్తిస్తూనే ఉంటారు. స్ఫూర్తిదాయక ఉద్యోగుల గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు బహుమతులు ఇచ్చి ప్రోత్సహించడం, సత్కరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ మహిళా కండక్టర్ గురించి సజ్జనార్ కు తెలిసింది. సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ అనే వ్యక్తి తనకు ఆ కండక్టర్‌తో ఎదురైన అనుభవాన్ని ఫేస్‌బుక్ లో పోస్టు చేయగా.. దాన్ని సజ్జనార్ గుర్తించారు.


‘‘టీజీఎస్ఆర్టీసీ కండక్టర్ అనుపమ పనితనం గురించి ఫేస్‌బుక్ లో అద్భుతంగా రాసుకొచ్చారో నెటిజన్. ప్రయాణికులను తమ కుటుంబ సభ్యుల్లాగానే ఆర్టీసీ సిబ్బంది భావిస్తారని చెప్పడానికి ఈ పోస్టే నిదర్శనం. నిత్యం పని ఒత్తిడిలోనూ 'ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే.. అలుపుసొలుపేం ఉన్నది' అంటూ సిబ్బంది తమ వృతి పట్ల అభిరుచిని కనబరుస్తుండటం గొప్ప విషయం. ఏ వృత్తి అయినా రొటీన్ కి భిన్నంగా ఆస్వాదిస్తూ పని చేస్తే ఎంత ఒత్తిడి అయినా ఇట్టే జయించవచ్చు’’ అని సజ్జనార్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.






సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ ఓసారి మెహదీ పట్నం నుంచి ఆరాంఘర్ వెళ్లే సిటీ బస్ ప్రయాణంలో అనుపమ అనే కండక్టర్ ను చూశారు. ఆమె డ్యూటీ చేస్తున్న తీరు ఆయన్ను విపరీతంగా ఆకట్టుకుందని తన పోస్టులో రాశారు. 


‘‘బస్సులో ఎక్కిన ప్రతి ఒక్కరినీ ఆమె కదిలిస్తూనే వుంది మాటల్తో. "ఏరా, దోస్తాన్లని వదిలేసి వచ్చారా.." అని కాలేజీ ఆడ పిల్లల్ని.. "ఏం అక్కా కనిపిస్తలెవ్" అంటూ కూరగాయల గంప ఆడమనిషిని, "ఏం సార్, ఈరోజు ఆఫీసుకి డుమ్మానా?"అని ఉద్యోగిని.. "ఏం పాపా, మా తమ్ముడు తిండి పెడ్తలేడా? ఎముకలు బయటపడుతున్నాయి" బక్కచిక్కిన యువతి భుజమ్మీద చెయ్యివేయగానే, "అవును, నా తిండికూడా ఆయనే తింటున్నడు" అని రిటార్టు రాగానే, "నేను ఇంటికొచ్చి చెప్తాలే.."మాట పూర్తికాక మునుపే.." ఈ ముచ్చట ఇంకెన్ని రోజులు చెప్తవ్, ఎప్పుడన్నా వచ్చినవా, చెప్పడమే గానీ" నిష్టూరమాడిందా యువతి. "బిడ్డా, చిన్నా, బేటా.." ఇలా పలకరింపులతోనే కాలేజీ పిల్లల్ని పలకరిస్తోంది, ఎక్కేవాళ్లు విష్ చేయడం, దిగేవాళ్లు "పోతానక్కా" అనేవాళ్లు, దిగాక రోడ్డు మీద నుండి కిటికీలోకి చేయి వూపేవాళ్ళూ.. ఎంత గొప్ప అదృష్టవంతురాలీమె అనుకున్నా. ఉర్దూ, తెలుగు, ఇంగ్లిష్ కలగలిసిన ఆమె మాటలు, వాటిని ఒక చోట చేర్చి కట్టే మాటల మాలలో కనిపించని దారంలాంటి ప్రేమ.. నన్ను చకితుడిని చేసింది.


పూలగంపతో ఎక్కిన పూలమ్ముకునే స్త్రీ, బుట్ట తెరిచి ఆప్యాయంగా నాలుగైదు రోజా పూలు చేతికందించగానే, అక్కడే ఒక పువ్వు తాను జడలో గుచ్చుకుని, కొంచెం వెనక్కి వచ్చి మిగతా వాళ్లకిచ్చేసింది, "ఇంగ ఇంటికి యాడ తీస్కపోతం మేడం" నా సహచరికి ఒక పువ్వు చేతికందిస్తూ, తన జడలో పువ్వై నవ్వింది’’ అని సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ తన అనుభవాన్ని తన పోస్టులో రాశారు.