Government Job and Plot for Mohammed Siraj: టీమిండియా క్రికెటర్, తెలంగాణకు చెందిన మహమ్మద్ సిరాజ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్‌ను తగిన రీతిలో తెలంగాణ ప్రభుత్వం గౌరవించింది. సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అదే విధంగా ఇంటి స్థలం సైతం కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంటికి అనువైన స్థలాన్ని గుర్తించాలన్నారు.
టీ20 వరల్డ్ కప్ నెగ్గిన అనంతరం ముంబైలో విజయోత్సవాలు పూర్తి చేసుకుని సిరాజ్ హైదరాబాద్‌కు వచ్చాడు. ఈ క్రమంలో మహమ్మద్ సిరాజ్ మంగళవారం (జులై 9న) తెలంగాణ ముఖ్యమమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. సీఎం రేవంత్ నివాసంలో సిరాజ్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశాడు. టీమిండియా టీ20 ప్రపంచ కప్ సాధించినందుకు హైదరాబాదీ సిరాజ్ ను రేవంత్ రెడ్డి అభినందించి, శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా పేసర్ సిరాజ్ సీఎం రేవంత్ రెడ్డికి టీమిండియా జెర్సీని బహుకరించాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కోమటి రెడ్డి వెంకటరెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
భవిష్యత్‌లో మహమ్మద్ సిరాజ్ మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. అదే విధంగా భారత క్రికెట్ జట్టుకు మరిన్ని సేవలు అందిస్తూ మంచి పేరు తేవాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఇటీవల అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని భారత జట్టు కైవసం చేసుకుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా ఉత్కంఠభరిత ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి 17 ఏళ్ల తరువాత పొట్టి ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడింది. వరల్డ్ కప్ నెగ్గిన తరువాత వాతావరణం అనుకూలించక క్రికెటర్లు రెండు రోజులు అక్కడే ఉండిపోయారు. భారత ప్రభుత్వం ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి ఆటగాళ్లు, సిబ్బందిని ఇక్కడికి రప్పించింది. మొదట ప్రధాని మోదీ భారత ఆటగాళ్లను కలిశారు. వారి ఆటతీరును మెచ్చుకున్నారు. దేశం గర్వించేలా చేశారని ప్రశంసల జల్లులు కురిపించారు.
అనంతరం ముంబైలో టీ20 వరల్డ్ కప్ హీరోలను ఘనంగా సన్మానించారు. ఆ తరువాత ఆటగాళ్లు వారి స్వస్థలాలకు వెళ్లగా.. క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ కు హైదరాబాద్‌కు చేరుకున్న సందర్భంగా ఘనస్వాగతం లభించింది. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకోగా, సిరాజ్ సేవల్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం అతడికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం ఇస్తామని ప్రకటించి గౌరవించింది.