హైదరాబాద్ వాసులకు కలల ప్రాజెక్టు త్వరలో సాకారం కానుంది. నగరం నుంచి ముంబయికి బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగంగా మరో అడుగు ముందుకు పడింది. హైదరాబాద్‌ - ముంబయి మధ్య బుల్లెట్‌ రైలు హైస్పీడ్‌ మార్గాన్ని నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై కేంద్ర ప్రభుత్వం సర్వే చేపట్టింది. భూసేకరణపైనా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని థాణె జిల్లా అధికారులకు ప్రతిపాదిత బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు సమాచారాన్ని తెలియజేసింది. సంబంధిత వివరాలను థాణె జిల్లా డిప్యూటీ కలెక్టర్‌ ప్రశాంత్‌ సూర్యవంశీ, ఇతర అధికారులకు జాతీయ హైస్పీడ్‌ రైలు కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీ) డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ఎన్‌.కె.పాటిల్‌ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. 


Also Read: Nellore News: పోలీస్ స్టేషన్ లో ప్రేమ పంచాయితీ... తల్లిదండ్రులకు కౌన్సెలింగ్.. కానీ


నవంబర్‌ 5న ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ బిడ్‌ సమావేశం నిర్వహించనున్నట్టు నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అచల్‌ ఖేర్‌ తెలిపారు. అదే నెల 18న టెండర్లు తెరిచే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. హైదరాబాద్‌-ముంబయిల మధ్య దూరం 650 కిలో మీటర్లు కాగా ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ప్రయాణానికి దాదాపు 14 గంటల సమయం పడుతోంది. అదే బుల్లెట్‌ రైలు అందుబాటులోకి వస్తే 3 గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చు. హైదరాబాద్‌ - ముంబయి మధ్య మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల పరిధుల్లో మొత్తం 11 స్టేషన్లు ఉంటాయని అంచనా.


Also Read: Hyderabad News: మణికొండలో డ్రైనేజీలో పడి గల్లంతైన యువకుడు... 48 గంటల తర్వాత మృతదేహం లభ్యం..


తొలుత జహీరాబాద్ మీదుగా..
ముంబయి-హైదరాబాద్‌ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును ముందుగా మెదక్ జిల్లా జహీరాబాద్‌ను లింక్‌ చేస్తూ నిర్మించాలని అనుకున్నారు. ఆ తర్వాత దూరం, ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించేందుకు వికారాబాద్‌ మీదుగా నిర్మించేందుకు సర్వే చేస్తున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ముంబయి - పుణె - జహీరాబాద్‌ మీదుగా హైదరాబాద్‌ వరకు 780 కిలోమీటర్ల దూరం ఉంటుంది. తాజాగా ముంబయి - పుణె - గుల్బర్గా - తాండూరు - వికారాబాద్‌ మీదుగా హైదరాబాద్‌కు అలైన్‌మెంట్‌ మార్చడం వల్ల 649.76 కిలో మీటర్లకు తగ్గుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.


ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌ ఆధ్వర్యంలో బుల్లెట్‌ రైల్వే లైన్‌ సర్వే పనుల్లో భాగంగా.. వికారాబాద్‌ జిల్లా పరిధిలో ప్రభుత్వ పరంగా సహాయ, సహకారాలు అందించాలని ఈ సంస్థ ప్రతినిధులు ఇటీవల జిల్లా అధికారులను కోరారు. జిల్లా పరిధిలోని తాండూరు, పెద్దేముల్‌, ధరూర్‌, వికారాబాద్‌, నవాబ్‌పేట్‌ మండలాల్లోని 40 గ్రామాల్లో త్వరలోనే సోషల్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ చేపట్టనున్నారు.


Also Read: Cyclone Updates: బలహీనపడ్డ గులాబ్.. తెలంగాణ, ఏపీలో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఇక్కడ అతిభారీగా..


Also Read: AP Gulab Cyclone Effect: గులాబ్ తుపాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు... మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ప్రకటించిన సీఎం జగన్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి