గులాబ్‌ తుపాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వానలకు భాగ్యనగరం నీట మునిగింది. కూకట్‌పల్లి, హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీ, నిజాంపేట్, ప్రగతి నగర్‌, బోరబండ,ఎర్రగడ్డ, సనత్‌నగర్, ఈఎస్‌ఐ, అమీర్‌పేట, రహమత్ నగర్‌, యూసఫ్‌గూడ శ్రీకృష్ణ నగర్‌లో భారీ వర్షం కురిసింది. రోడ్లపై నడుములోతులో వరద నీరు చేరింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్‌లో కుండపోత వాన పడుతోంది. నగరంలోని ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. జూబ్లీహిల్స్-హైటెక్‌సిటీ మార్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. జూబ్లీహిల్స్ నుంచి వచ్చే వాహనాలను కేబుల్‌ బ్రిడ్జ్‌ మీదుగా ట్రాఫిక్ పోలీసులు మళ్లిస్తున్నారు. 










రహదారులపై నడుములోతు నీళ్లు


హిమాయత్‌నగర్, లక్డీకాపూల్‌, ఖైరతాబాద్‌, నాంపల్లి, అబిడ్స్, బషీర్‌బాగ్, నారాయణగూడ, కోఠి, సుల్తాన్‌బజార్, బేగంబజార్‌, ఎల్బీనగర్, నాగోల్, మన్సూరాబాద్‌లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. ట్రాఫిక్ జామ్ తో వాహనదారుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు బహదూర్‌పురా-కిషన్‌బాగ్ మార్గంలో నడుములోతులో నీరుచేరింది. ఇక్కడ తాడు సహాయంతో ప్రజలు రహదారి దాటేపరిస్థితి నెలకొంది. జీహెచ్‌ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేస్తున్నారు. రహదారిపై నిలిచిన నీటిని మ్యాన్‌ హోల్స్‌ ద్వారా పంపేందుకు సహాయచర్యలు చేపట్టారు. ప్రధాన రహదారులపై వరద నీటిని జీహెచ్ఎంసీ సిబ్బంది మోటర్ల సాయంతో ఎత్తిపోశారు. ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకలను క్రమబద్దీకరించేందుకు శ్రమిస్తున్నారు. 


Also Read: గులాబ్‌ తుపాను ప్రభావం...ఆంధ్రప్రదేశ్ లో కుంభవృష్టి, తెలంగాణలో మరో మూడు రోజులు దంచికొట్టనున్న వానలు..హైదరాబాద్ లో హై అలెర్ట్






నేడు, రేపు హై అలర్ట్


నగరవాసులు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. ఇవాళ, రేపు హై అలర్ట్‌ ప్రకటించారు. వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించడంతో నగర వాసులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. అవసరమైతే  040-23202813 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని అధికారులు తెలిపారు. 


Also Read:  గులాబ్ తుపాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు... మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ప్రకటించిన సీఎం జగన్




14 జిల్లాల్లో రెడ్ అలర్ట్


తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండటంతో 14 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించింది. నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, సిద్ధిపేట, పెద్దపల్లి, కరీంనగర్‌, మహబూబాబాద్‌, జనగామ, వరంగల్‌, హన్మకొండ, ఖమ్మం కొత్తగూడెం జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది వాతావరణశాఖ.



పరీక్షలు వాయిదా


గులాబ్ తుపాను కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో 28, 29 తేదీల్లో జరగాల్సిన ఇంజినీరింగ్, డిగ్రీ పరీక్షలను వాయిదా వేసినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఈ రెండు రోజుల్లో జరిగే పరీక్షలు మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామో తర్వాత వెల్లడిస్తామన్నారు.  జేఎన్టీయూ, ఓయూ పరిధిలో పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. 




Also Read: హైదరాబాద్‌‌కు రెడ్ అలర్ట్! మరో 3 గంటల్లో అతి తీవ్రంగా వర్షం.. IMD ట్వీట్‌, హెచ్చరికలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి