గులాబ్‌ తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీరం దాటి బలహీనపడుతున్నా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో వరద ముంపుపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో అతి భారీ వర్షాలతో అతలాకులతం అవుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.  భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. తుపాను ఆదివారం రాత్రి కళింగపట్నం వద్ద తీరం దాటింది. బలహీనపడిన తుపాను ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా పయనిస్తుంది. మరో కొన్ని గంటల్లో మరింత బలహీనపడుతుందని భారత వాతావరణశాఖ అంచనా వేస్తుంది. ఉత్తరాంధ్రలో ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారుల హెచ్చరికలు జారీచేశారు. 


తీవ్రవాయుగుండంగా 


గులాబ్‌ తుపాను బలహీనపడి తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కన్నబాబు స్పష్టం చేశారు. రాగల 6 గంటల్లో అది మరింత బలహీనపడి వాయుగుండంగా మారుతుందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుని వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయన్నారు. ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. ఉత్తరాంధ్రలో గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని,  సముద్రం అలజడిగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండా సురక్షితంగా ఉండాలని అధికారులు కోరారు.



మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం


తుపాను పరిస్థితులపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు, అధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ తుపాను అనంతర పరిస్థితులను సీఎంకు వివరించారు. వర్షం తగ్గగానే విద్యుత్‌ పునరుద్ధరించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. తుపాను పరిస్థితులపై సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ విశాఖలో ఉండి ఆరా తీస్తున్నారు. ఈరోజు కూడా అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షించాలని సీఎస్‌కు సీఎం సూచించారు. తుపాను వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం వెంటనే ఇవ్వాలని సీఎం ఆదేశించారు.


 


Also Read: గులాబ్‌ తుపాను ప్రభావం...ఆంధ్రప్రదేశ్ లో కుంభవృష్టి, తెలంగాణలో మరో మూడు రోజులు దంచికొట్టనున్న వానలు..హైదరాబాద్ లో హై అలెర్ట్


బాధితులకు రూ.వెయ్యి సాయం


బాధితులకు సహాయం చేయడంలో వెనకడుగు వేయవద్దని అధికారులకు సీఎం జగన్ సూచించారు. సహాయక శిబిరాల్లో అందించే ఆహారం నాణ్యంగా ఉండాలన్నారు. మెరుగైన వైద్యం, రక్షిత తాగునీరు అందించాలని సూచించారు. అవసరమైన చోట్లా సహాయక శిబిరాలు ఏర్పాటుచేయాలని, విశాఖలోని ముంపు ప్రాంతాల్లో వర్షపు నీరు తొలగించాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్న సీఎం జగన్... ఇళ్లలోకి నీరు చేరిన కుటుంబాలకు రూ.వెయ్యి తక్షణసాయం అందించాలన్నారు. అలాగే శిబిరాల నుంచి బాధితులు తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు రూ.వెయ్యి చొప్పున అందజేయాలన్నారు. వరద ప్రాంతాల్లో త్వరగా పంట నష్టం అంచనాలు రూపొందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. 


Also Read:  గులాబ్ తుపాను ప్రభావంతో రద్దైన, దారిమళ్లించిన రైళ్ల వివరాలివే...


టీడీపీ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొనండి : చంద్రబాబు


గులాబ్ తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. అలాగే తుపాను వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు, ప్రజలను తక్షణమే ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. తుపాను పీడిత ప్రాంతాల్లో ప్రజలకు ఏ సాయం కావాల్సి వచ్చినా అందించేందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. సమస్యలపై ప్రభుత్వానికి వెంటనే సమాచారమిచ్చి అప్రమత్తం చేయాలన్నారు. 






Also Read: తుపాను తీరం దాటిన టైంలో జరిగిన బీభత్సం ఇదీ.. వెల్లడించిన కలెక్టర్, రేపు ఇంకో అల్పపీడనం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి