తెలుగు రాష్ట్రాలపై గులాబ్ తుపాను ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే గత రెండు రోజులుగా కుండపోత వర్షాలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. నిన్న (సెప్టెంబరు 27) గులాబ్ తుపాను ఉదయం 2.30 గంటలకు తీవ్ర వాయు గుండంగా మారిందని, తాజాగా బలహీన పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారిణి డాక్టర్ కే. నాగరత్న తెలిపారు. ప్రస్తుతం ఇది పశ్చిమ దిశలో గంటకు 14 కిలోమీటర్ల దూరంలో వెళ్తోందని తెలిపారు. ఛత్తీస్ గఢ్‌లో ఉన్న జగదల్ పూర్‌కు దక్షిణ దిశలో 65 కిలో మీటర్ల దూరంలో, భద్రాచలానికి ఈశాన్య దిశలో 150 కిలో మీటర్ల దూరంలో కేంద్రీక్రుతమైన ఉందని తెలిపారు. ఇది మరింత బలహీన పడుతుందని తెలిపారు. ఈశాన్య అరేబియా సముద్రం వైపు ఈ గులాబ్ తుపాను కదిలే అవకాశం ఉన్నట్లు నాగరత్న అంచనా వేశారు.
Also Read: బలహీనపడ్డ గులాబ్.. తెలంగాణ, ఏపీలో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఇక్కడ అతిభారీగా..
దీని ప్రభావంతో తెలంగాణలో రానున్న 24 గంటల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు విస్తారంగా ఉంటాయని, ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం అధికారిణి నాగరత్న అంచనా వేశారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తాజాగా చేసిన ట్వీట్‌లోని వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ అన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో ఈ జిల్లాలన్నింటికీ ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్రాంతాల్లో వర్షాలు
బలహీన పడుతున్న గులాబ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర మొత్తం కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎస్టెర్‌లా తెలిపారు. రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు పడతాయని చెప్పారు. ఉత్తర కోస్తాంధ్ర అన్ని జిల్లాలు సహా క్రిష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఒకటి లేదా రెండు చోట్ల అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, ఈదురుగాలులు గంటకు 50 నుంచి 70 కిలో మీటర్ల దూరంతో వీస్తాయని అంచనా వేశారు. కాబట్టి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని సూచించారు. మంగళ, బుధ వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
Also Read: e-Shram Card: మీ జీతం 15 వేల కంటే తక్కువా? మీకో శుభవార్త.. ఈ ఒక్క పని ఫ్రీగా చేస్తే ఎన్నో లాభాలు
Also Read: చుక్కలు చూపిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. మరింత పెరుగుదల