Ganagapur Special Bus: కర్ణాటకలోని గానుగాపూర్‌ దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్లాలని అనుకునే వాళ్లకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెబుతోంది. యాత్రికుల కోసం హైదరాబాద్ నుంచి నేరుగా గానుగాపూర్ చేరుకునేందుకు స్పెషల్ టూరిస్ట్ బస్సులను ఏర్పాటు చేసింది. గానుగాపూర్ తో పాటుగా మహారాష్ట్రలోని పండరీపురం, తుల్జాపూర్ లోని ప్రసిద్ధ ఆలయాలను సందర్శించే అవకాశాన్ని ఈ ప్యాకేజీ ద్వారా కల్పిస్తోంది. ఈ పుణ్యక్షేత్రాల యాత్ర జులై 31 జులై నుంచి ప్రారంభం అవుతుంది. ఆగస్టు 2వ తేదీన ముగుస్తుంది. జులై 31వ తేదీన హైదరాబాద్ ఎంజీబీఎస్ లో సాయంత్రం ఆరు గంటలకు బస్సు ప్రారంభం అవుతుంది.


అదే రోజు రాత్రి 11.30 గంటలకు గానుగాపూర్ చేరుకుంటారు. మరుసటి రోజు దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని మధ్యాహ్నం 12 గంటలకు పండరీపురానికి బయల్దేరి సాయంత్రం 4 గంటలకు చేరుకుంటారు. ఇక్కడ పాండురంగ స్వామిని దర్శించుకొని తల్జాపూర్ కు బయలు దేరుతారు. మూడో రోజు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ కు ప్రయాణం అవుతారు. మూడోరోజు ఉదయం 8.30 గంటలకు ఎంజీబీఎస్ చేరుకోవడంతో యాత్ర పూర్తి అవుతుంది. 






ఈ నెల 31న ప్రారంభమయ్యే ఈ సర్వీస్ ముందస్తు రిజర్వేషన్ ప్రస్తుతం కొనసాగుతోంది. భక్తులు http://tsrtconline.in వెబ్ సైట్ లోకి వెళ్లి తమ టికెట్లను బుకింగ్ చేసుకోవాలి. అలాగే బుకింగ్స్ లో ఏవైనా సందేహాలు ఉంటే 944056379, 99259226257, 9959224911 నెంబర్లకు సంప్రదించవచ్చని వివరించింది. టికెట్ బుకింగ్ ఛార్జీలు కూడా రూ.2,560గా టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. అయితే దర్శనం, భోజన, వసతి సదుపాయాలు భక్తుల బాధ్యతే అని టీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది.  


శ్రీశైలానికి ప్రతీ శనివారం స్పెషల్ బస్సులు


ఈ శ్రీశైలం టూర్ ప్యాకేజీ ధరను పెద్దలకు రూ.2,700, పిల్లలకు రూ.1,570గా టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ ఛార్జీల్లో భాగంగా రవాణా, బస, ఆలయ శీఘ్ర దర్శనం, శిఖరం ప్రవేశ ఛార్జి ప్యాకేజీలో ఉంటుంది. ఆహారం, అల్పాహారం, ఆలయంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు లాంటి ఇతర ఖర్చులను ప్రయాణికులే చెల్లించుకోవాల్సి ఉంటుంది. ప్రతి శనివారం ఉదయం ఈ టూర్‌ ప్రారంభమవుతుంది. తొలి రోజు హైదరాబాద్‌ లోని జేబీఎస్‌ నుంచి ఉదయం 7 గంటలకు సూపర్‌ లగ్జరీ బస్సు ఉంటుంది.


8 గంటలకు ఎంజీబీఎస్‌.. మీదుగా మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీశైలానికి చేరుకుంటుంది. ముందుగా బస కోసం డైరెక్ట్ గా హోటల్‌కు తీసుకెళ్తారు. అక్కడే మధ్యాహ్న భోజనాలు ఉంటాయి. తర్వాత 3 గంటలకు పాతాళ గంగకు తీసుకెళ్తారు. కృష్ణానదిలో బోటింగ్‌ కూడా ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ భ్రమరాంబిక అమ్మ వారి దర్శనాన్ని భక్తులు చేసుకోవాలి. శీఘ్ర దర్శన సదుపాయం అక్కడ అందుబాటులో ఉంటుంది. రాత్రికి ఆ హోటల్లోనే బస ఉంటుంది.


రెండో రోజు షెడ్యూల్ ఇలా


రెండో రోజైన ఆదివారం ఉదయం 5 నుంచి 8 గంటల వరకు భక్తులు ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేసుకోడానికి వీలు కల్పించారు. తర్వాత అల్పాహారం ఉంటుంది. హోటల్‌ చెక్‌అవుట్‌ చేయాలి. అక్కడి నుంచి శివాజి స్పూర్తి కేంద్రం, చెంచులక్ష్మి ట్రైబల్‌ మ్యూజియం లాంటి స్థానిక ప్రాంతాలు చూడవచ్చు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో సాక్షి గణపతి ఆలయ దర్శనంతో పాటు పాలధార, పంచధార, శిఖరం, శ్రీశైలం డ్యాం లాంటివి చూసే ఏర్పాట్లు ఉంటాయి. తిరుగు ప్రయాణం మధ్యలో మధ్యాహ్న భోజనం కోసం బస్సు ఆపుతారు. తర్వాత రాత్రి 7.30 గంటలకు బస్సు ఎంజీబీఎస్‌కు, 8.30 గంటలకు జేబీఎస్‌కు చేరుతుంది.