తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ పిల్ ను చెరుకు సుధాకర్, శ్రావణ్ కుమార్ దాఖలు చేశారు. దీన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. వరదల్లో చిక్కుకున్న ప్రజలకు ఎలాంటి ఆసరా కల్పిస్తున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల కొరకు వార్ రూమ్ లు ఏర్పాటు చేస్తున్నారని, మరి వరదల కోసం ఎందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం లేదని హైకోర్టు ప్రశ్నించింది.


వరదల్లో చిక్కుకున్న వారికి తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. కడెం ప్రాజెక్టు డ్యామ్ సేఫ్టీ చట్ట ప్రకారం రక్షించి ప్రజల ప్రాణాలు కాపాడాలన్న హైకోర్టు ఆదేశించింది. ఇప్పటివరకు డిజాస్టర్ చట్టప్రకారం ఎంతమందిని రక్షించారని హైకోర్టు ప్రశ్నించింది. వరదలకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై పూర్తి నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. వచ్చే సోమవారం నాడు ప్రభుత్వం పూర్తి నివేదిక సమర్పించాలని హైకోర్టు నిర్దేశించింది. తదుపరి విచారణ సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది.


ఖాళీ పదవులపైనా హైకోర్టు అసంతృప్తి


తెలంగాణలోని స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవులకు ఎన్నికలు నిర్వహించే విషయంలో కూడా హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ విషయంలో జాప్యం చేయడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు ఎన్నికలు జరపాలని దాఖలైన పిటిషన్ పై నేడు (జూలై 28) హైకోర్టులో విచారణ జరిగింది. న్యాయవాది భాస్కర్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ చేపట్టగా.. రాష్ట్ర వ్యాప్తంగా 220 సర్పంచి, 94 ఎంపీటీసీ, 4 జెడ్పీటీసీ, 5,364 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉందని పిటిషనర్‌ కోర్టుకు వెల్లడించారు. ప్రభుత్వం ఒప్పుకుంటే ఎన్నికలు జరపడానికి రెడీగా ఉన్నట్లుగా ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ధర్మాసనానికి వెల్లడించింది.


దీంతో ఖాళీగా ఉన్న పదవులకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని అడిగింది. వర్షాలు కురుస్తున్నా సరే ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ధర్మాసనం పేర్కొంది. అసలు ఎప్పట్లోగా ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు గట్టిగా అడిగింది. ఈ అంశంపై విచారణను హైకోర్టు  రెండు వారాలకు వాయిదా వేసింది.