అమెరికాలో జులై 2 న పిడుగుపాటుకు గురైన భారతీయ విద్యార్థిని కొంచెం కోలుకుంటున్నట్లు అక్కడి వైద్య బృందం తెలిపింది. విద్యార్థినికి వెంటిలేటర్ తీసేసినట్లు వారు వివరించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదువుతున్న సుస్రూణ్య కోడూరు ఈ నెల మొదట్లో తన స్నేహితులతో కలిసి ఓ చెరువు పక్కగా నడుస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆమె మీద పిడుగు పడింది. దాంతో ఆమె పక్కనే ఉన్న చెరువులోకి పడిపోయింది. ఆ సమయంలో ఆమె గుండె దాదాపు 20 నిమిషాల పాటు ఆగిపోయింది.
దాంతో ఆమె మెదడులోని కొన్ని నరాలు దెబ్బతినడం వల్ల కోమాలోకి వెళ్లిపోయినట్లు అక్కడి వైద్య బృందం తెలిపింది. సుమారు 26 రోజుల తరువాత ఆమె తనకు తానుగా శ్వాస తీసుకుంటుందని వైద్య బృందం తెలిపింది. అందుకే ఆమెకు వెంటిలేటర్ తొలగించినట్లు వారు వివరించారు.
సుస్రూణ్య కోడూరు ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ లో విద్యను అభ్యసిస్తుంది. ఆమె స్వస్థలం హైదరాబాద్. ఆ దుర్ఘటన జరిగినప్పటి నుంచి కూడా హ్యూస్టన్ యూనివర్సిటీ అధికారులు విద్యార్థిని తల్లిదండ్రులతో టచ్ లో ఉన్నారు. విద్యార్థిని యోగక్షేమాలు ఎప్పటికప్పుడు వారికి యూనివర్సిటీ అధికారులు తెలియజేస్తున్నారు. యూనివర్సిటీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో కూడా సుస్రూణ్య కి జరిగిన ప్రమాదం గురించి ప్రస్తావించింది. కానీ ఆ తరువాత ఎటువంటి ప్రకటన చేయలేదు.
తాజాగా జులై 26న యూనివర్సిటీ తన ట్విట్టర్ ఖాతాలో '' బరువెక్కిన మా హృదయాలు ఇప్పుడు తేలిక పడుతున్నాయి. ఎందుకంటే మమ్మల్ని అందరిని ఎంతో ఆందోళనకు గురి చేసిన మా విద్యార్థిని సుస్రూణ్య ఇప్పుడు కోలుకుంటుంది'' అంటూ రాసుకొచ్చింది. ఈ క్రమంలోనే విద్యార్థిని తల్లిదండ్రులు కూడా అమెరికా కు వచ్చేందుకు అగ్రరాజ్యం ఆమోదం తెలిపింది.
వారికి అమెరికా వీసాలు కన్ఫర్మ్ అయ్యాయి. అతి త్వరలోనే వారిద్దరూ అమెరికాకు చేరుకుంటారని వారి బంధువు ఒకరు తెలిపారు. పిడుగుపాటుకు గురైన సమయంలో ఆమె గుండె 20 నిమిషాలు కొట్టుకోవడం ఆగిపోవడంతో ఆమె మెదడులోని నరాలు దెబ్బతిన్నాయి. దాని వలన ఆమె దేనికి స్పందించలేకపోవడంతో పాటు ఆమె శ్వాస తీసుకోవడం కూడా ఆగిపోయింది.
దీంతో మెదడు పనితీరు ఆగిపోయింది. విద్యార్థిని చికిత్స కోసం చాలా ఖర్చు చేయాల్సి ఉండగా '' GoFundMe'' ద్వారా విరాళాలు ఇవ్వాల్సిందిగా విద్యార్థిని స్నేహితులు, బంధువులు కోరారు. ఆమె మాములు స్థితికి రావడానికి కుటుంబ సభ్యులు అందరి సాయం కోరారు. ప్రస్తుతం సుస్రూణ్య తన చదువుని పూర్తి చేయడానికి చివరి దశలో ఉంది. అంతేకాకుండా ఆమె ఇంటర్న్‌షిప్ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే ఇలా జరిగిందని ఆమె స్నేహితులు తెలిపారు.
గడిచిన 30 సంవత్సరాలలో సంవత్సరానికి సగటున 43 మంది పిడుగులు పడి చనిపోతున్నారు. పిడుగుపాటుకు గురైన వారిలో సుమారు పది శాతం మంది చనిపోతున్నారు. 90 శాతం మంది వివిధ స్థాయిలలో వైకల్యంతో బాధపడుతున్నారని నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపింది.