Hottest July 2023: 



జులైలో రికార్డులు బద్దలు


గ్లోబల్ వార్మింగ్. ఇప్పటి వరకూ మనం వింటున్న విషయమే. కానీ...వార్మింగ్ కాదు త్వరలోనే బాయిలింగ్ పాయింట్‌కి చేరుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు సైంటిస్ట్‌లు. అందుకు తగ్గట్టుగానే జులైలో ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అది అలాంటి ఇలాంటి రికార్డు కాదు. లక్షా 20వేల సంవత్సరాల్లో ఈ స్థాయి ఉక్కపోత ఎప్పుడూ లేదని తేల్చి చెప్పారు శాస్త్రవేత్తలు. అంటే...ఇది ఎలాంటి రికార్డో అర్థం చేసుకోవచ్చు. గతంలోనూ ఇదే జులై నెలలో వాతావరణం ఉక్కిరిబిక్కిరి చేసినప్పటికీ...ఇప్పుడు నమోదైన ఉష్ణోగ్రతలతో పోల్చుకుంటే అది తక్కువే. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత (Global Avg Temp)కు 0.2 డిగ్రీల మేర పెరిగిపోయింది. ఇలా నంబర్స్ పరంగా చూసుకుంటే తక్కువే కదా అనిపించినా...అది పుట్టించే వేడి అంతా ఇంతా కాదు. అందుకే...2023 జులైని "చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన నెల"గా డిక్లేర్ చేశారు. జర్మనీకి చెందిన Leipzig University ఈ ఉష్ణోగ్రతలపై అనాలసిస్ చేసి ఈ విషయం వెల్లడించింది. అమెరికా, గ్రీక్ ప్రాంతాల్లో టెంపరేచర్స్‌ పెరిగిపోయి...అడవులు తగలబడిపోయాయి. 2019 జులైలోనూ ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అప్పుడే "బాబోయ్ ఏంటీ ఉక్కపోత" అనుకున్నారు. కానీ...అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు 0.2 డిగ్రీల కన్నా ఎక్కువ టెంపరేచర్స్ రికార్డ్ అయ్యాయి. ఇది యురోపియన్ యూనియన్ ఇచ్చిన డేటానే. యూనివర్సిటీ పెన్సిల్వేనియాకి చెందిన సైంటిస్ట్ మైకేల్ మాన్ మాటల్లో చెప్పాలంటే...శిలాజ ఇంధనాలు మండే కొద్దీ ఇలా భూమి కూడా మండిపోతుంది. అంటే వాటి వాడకం ఆ స్థాయిలో ఉంటోంది మరి. సాధారణంగా గ్లోబల్ మీన్ టెంపరేచర్ జులైలో 61 ఫారన్‌హీట్‌గా నమోదవుతుంది. కానీ...ఈ సారి అది 63 ఫారన్‌ హీట్‌లకు చేరుకుంది. 


ఓ వైపు మంటలు..మరో వైపు వరదలు..


ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ వాతావరణ విభాగం (WMO) కూడా ఈ ఉష్ణోగ్రతలపై ఆందోళన వ్యక్తం చేసింది. 2023 జులై అన్ని రికార్డులూ చెరిపేసిందని వెల్లడించింది. ఈ ఉష్ణోగ్రతల ప్రభావం ఇప్పటికే చాలా చోట్ల కనిపిస్తోంది. సాధారణంగా ఎడారి ప్రాంతాల్లో రాత్రి పూట వాతావరణం చల్లబడుతుంది. కానీ...కాలిఫోర్నియాలోని Death Valleyలో రాత్రి పూట కూడా ఉష్ణోగ్రతలు ఏ మాత్రం తగ్గడం లేదు. వాయువ్య చైనాలోనూ ఆ దేశంలోనే అత్యధికంగా 52.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కెనడాలో కారుచిచ్చులు చల్లారడం లేదు. ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, పోలాండ్‌లో వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వాతావరణ మార్పుల వల్ల కలిగే "ముప్పుకి" ఇది టీజర్ మాత్రమే అంటున్నారు సైంటిస్ట్‌లు. సముద్రాలు కూడా వేడెక్కిపోయాయి. భూగ్రహంలోనే అత్యంత చల్లగా ఉండే అంటార్కిటికాలోనూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయంటే...క్లైమేట్ ఛేంజ్ ఎంత ప్రభావం చూపిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఇలా ఓ వైపంతా వేడెక్కిపోతుంటే...మరి కొన్నిచోట్ల మాత్రం వరదలు ముంచెత్తాయి. ఇప్పుడు ఇండియాలో ఇదే జరుగుతోంది. భారత్‌లోనే కాదు. సౌత్‌ కొరియా, జపాన్, పాకిస్థాన్‌లోనూ ఇవే పరిస్థితులున్నాయి. El Nino ఎఫెక్ట్‌ తొలిదశలో ఉందని, అందుకే ప్రపంచమంతా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాదితో ఇది అయిపోదని, వచ్చే సంవత్సరమూ ఎల్ నినో ప్రభావం కొనసాగుతుందని హెచ్చరిస్తున్నారు. 2024 కూడా చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరాల జాబితాలో చేరిపోతుందని తేల్చి చెబుతున్నారు. 
 


Also Read: Anju In Pakistan: పాక్ బాయ్‌ఫ్రెండ్‌తో ఫుల్ ఎంజాయ్ చేస్తున్న అంజు, నస్రుల్లాతో కలిసి డిన్నర్ - వీడియో వైరల్