తెలంగాణలో రాష్ట్రంలో ఉన్నత విద్య పరీక్ష విధానంలో గుణాత్మక మార్పులు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)తో రాష్ట్ర ఉన్నత విద్యామండలి, కమిషరేట్ ఆఫ్ కాలేజీయేట్ ఎడ్యుకేషన్ గతేడాది అక్టోబరు 21న అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఐఎస్‌బీ టీమ్ సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి 258 మంది కాలేజీల లెక్చరర్లు, 692 మంది విద్యార్థుల అభిప్రాయాలను సర్వే రూపంలో సేకరించింది.
ఈ అధ్యయనంలో ప్రస్తుతం డిగ్రీ మూల్యాంకనం, పరీక్షల విధానంపై 41 శాతం మంది అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇప్పుడున్న విధానం 80 శాతం కంటే అధికంగా సమర్థంగా ఉందని కేవలం 14 శాతం విద్యార్థులే అభిప్రాయపడ్డారు. తమకు ఉద్యోగ, ఉపాధిని పెంచేలా పరిశ్రమలు కోరుకునే నైపుణ్యాలను అందించాలని కోరుకుంటున్నారు.
డిగ్రీ విద్యలో సంస్కరణలకు ఇండియన్ స్కూట్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) కీలక సూచనలు చేసింది. ఇందులో భాగంగా కళాశాలకు క్రమం తప్పకుండా హాజరై, తరగతి గదిలో క్రియాశీలకంగా చర్చల్లో పాల్గొనే విద్యార్థులకు ప్రత్యేకంగా మార్కులు ఇవ్వాలని సూచించింది. కేవలం పాఠాలు చెప్పడం, రాత పరీక్షలు జరిపి విద్యార్థుల ప్రతిభను అంచనా వేయడం కాకుండా 360 డిగ్రీల్లో వారిని పరీక్షించేలా.. అసలైన నైపుణ్యాలు అలవడేందుకు ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్‌లు, గ్రూప్ డిస్కషన్స్, క్విజ్‌లు లాంటి వాటికి పెద్దపీట వేయాలని విద్యాశాఖకు ఐఎస్‌బీ సూచించింది.
జవాబుపత్రాల మూల్యాంకనం.. ప్రతిభను అంచనా వేయడం.. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఎనిమిది నెలల క్రితం ఐఎస్‌బీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయాల ఉపకులపతులతోపాటు డిగ్రీ అధ్యాపకులు, విద్యార్థులతో స్వయంగా మాట్లాడి ఇటీవలే ఆయా సిఫార్సులతో కూడిన నివేదికను ఉన్నత విద్యామండలికి ఐఎస్‌బీ అందజేసింది. అధికారులు దాన్ని ప్రభుత్వానికి సమర్పించారు. త్వరలో విద్యాశాఖ మంత్రితో నివేదికను ఆవిష్కరింపజేసి అమలుపై నిర్ణయం తీసుకోనున్నారని తెలిసింది.
ఐఎస్‌బీ ముఖ్యమైన సిఫార్సులివీ..
➥ప్రస్తుతం విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉంటోంది. హాజరుకూ కూడా మార్కులు (క్రెడిట్లు) ఇవ్వడం ద్వారా కాలేజీలకు వచ్చే విద్యార్థుల సంఖ్య పెరుగుంది.
➥ ఈ విద్యా సంవత్సరం(2023-24) రెండో సెమిస్టర్‌లో ప్రయోగాత్మకంగా అయిదు కళాశాలల్లో కొత్త పరీక్షలు, మూల్యాంకన విధానాన్ని అమలు చేయాలి.
➥ పరిశ్రమలు, కళాశాలల మధ్య అనుసంధానం పెంచాలి. ఇంటర్న్‌షిష్‌లు, ప్రాంగణ నియామకాల కల్పనకు ఒక ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను రూపొందించాలి.
➥ ప్రతి విశ్వవిద్యాలయంలో సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ ఎవాల్యుయేషన్ అండ్ అసెస్‌మెంట్ పేరిట కేంద్రాలను నెలకొల్పాలి. అక్కడ మూల్యాంకనం, పరీక్షల నిర్వహణలో కొత్త విధానాలను అమలు చేసేందుకు పరిశోధన జరపాలి.
➥ డిగ్రీ స్థాయిలో పరిశోధన సంస్కృతిని పెంచాలి. విద్యార్థులు చదువుకోడానికి, మూల్యాంకనం కోసం ఆన్‌లైన్, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను అందుబాటులోకి తీసుకురావాలి.
➥ విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు, ప్రాజెక్టు అధ్యయనాలు, ఇంటర్న్‌షిప్‌లు, పరిశ్రమల సందర్శన, నిరంతర మూల్యాంకనం, క్విజ్‌లు, ఆన్‌లైన్ సిమ్యులేషన్లు తదితర వాటిని ప్రవేశపెట్టాలి.
➥ కోర్సు వర్క్‌పై ఎక్కువ దృష్టి పెట్టకుండా(వారానికి 34 గంటలకు మించకుండా) సాఫ్ట్ స్కిల్స్‌ను ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అందించాలి.
➥ ప్రస్తుతం ఒక్కో వర్సిటీ పరిధిలో ఇంటర్నల్స్, రాత పరీక్షలకు మార్కుల కేటాయింపు విధానం ఒక్కోలా ఉంది. అంతర్గత పరీక్షల మార్కులను 30 లేదా 40కి పెంచాలని, దానివల్ల సదస్సులు, లైవ్ ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్‌లు, పరిశోధన పత్రాలు, ప్రెజెంటేషన్లను నిర్వహించి మార్కులు ఇవ్వొచ్చని అధిక శాతం అధ్యాపకులు అభిప్రాయపడ్డారు.
➥ భవిష్యత్తులో ఎక్కువ డిమాండ్ ఉన్న కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, క్లౌడ్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ, రోబోటిక్స్ తదితర కోర్సులను అన్ని వర్సిటీల పరిధిలో ప్రవేశపెట్టాలి.