హైదరాబాద్‌లో ఓ యువకుడు తన ఇంట్లోకి వచ్చిన పామును పట్టుకుని స్థానిక జీహెచ్ఎంసీ ఆఫీసుకు తీసుకెళ్లి అక్కడ వదిలిన సంగతి గుర్తుంది కదా!. నగరంలో  చాలా చోట్ల ఇలాంటి పరిస్థితే నెలకొంది. హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో పాములు, కొండ చిలువలు నివాస ప్రాంతాల్లోకి చేరుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో నగరం, శివార్లలో అనేక చోట్ల పాములు ఇళ్లలోకి చొరబడుతున్నాయి. హైదరాబాద్‌లో ఇలాంటి పరిస్థితి కొంచెం ఎక్కువగానే ఉంది. ఇంట్లోకి పాము ప్రవేశిస్తే ఎవరికి చెప్పుకోవాలో చాలా మందికి తెలియదు. తాజాగా నారాయణపేట జిల్లా పసుపుల గ్రామ సమీపంలో కృష్ణా నది ఒడ్డున మొసళ్లు ప్రత్యక్షమయ్యాయి. కొన్ని నెలల క్రితం, మీర్ ఆలం ట్యాంక్ సమీపంలోని నివాసితులు ట్యాంక్‌లో మొసళ్ళు నివసిస్తున్నారని ఫిర్యాదు చేశారు. 


అలాంటి సందర్భాల్లో కింద ఉన్న ఫోన్ నెంబర్లు మీకు ఉపయోగపడతాయి. ఎవరైనా మొసళ్లు, కొండ చిలువలు, ఇతర వన్యప్రాణులను గుర్తిస్తే తెలంగాణ అటవీ శాఖ ఫోన్ నంబర్ 1800 425 5364ను సంప్రదించవచ్చు. ఇళ్లలో పాములు కనపడితే 83742 33366 డయల్ చేసి ద్వారా స్నేక్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీని సంప్రదించవచ్చు. ఏదైనా ఇతర జంతువుల కోసం, వ్యక్తులు యానిమల్ వారియర్స్ సెల్‌ఫోన్ నంబర్ 969788 7888లో సంప్రదించడం ద్వారా సాయం పొందొచ్చు. 


హైదరాబాద్ శివారు అల్వాల్ ప్రాంతంలో ఉన్న సంపత్ కుమార్ ఇంట్లోకి వాన నీటితో పాటు పాము కూడా వచ్చింది. జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఇంట్లోకి పాములు వస్తుంటే చాలా భయంగా ఉందని అధికారులు తమకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. అయితే అధికారులు ఆరు గంటలైనా స్పందించలేదు. దీంతో ఆగ్రహించిన సంపత్ ఇంట్లోకి వస్తున్న పాముల్లో ఒక దానిని పట్టుకుని దానిని  స్థానిక జీహెచ్ఎంసీ ఆఫీసుకు తీసుకెళ్లాడు. ఓ అధికారి టేబుల్ మీద ఆ పామును వదిలిపెట్టి తన నిరసనను తెలియజేశాడు. సంపత్ కుమార్ చేసిన పనికి జీహెచ్ఎంసీ అధికారులు భయాందోళనకు గురయ్యారు. అక్కడి నుంచి పరుగులు తీశారు.


హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలకు ఓ కొండ చిలువలు రోడ్డుపైకి వస్తున్నాయి. నగరంలో ఒకే రోజు రెండు చోట్ల కొండ చిలువలు రోడ్లపైకి వచ్చాయి. నిత్యం రద్దీగా ఉండే కూకట్‌పల్లి, ప్రగతినగర్‌ ప్రధాన రహదారిపై బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి కొండచిలువ రోడ్డుపై దర్శనమిచ్చింది. దీంతో కొద్ది నిమిషాల పాటు ట్రాఫిక్ ఏర్పడింది. అది రోడ్డు దాటుకునే వరకు వాహనదారులు ఎదురుచూశారు. ఇలాంటి సందర్భాల్లో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇస్తే దానిని వారు పట్టుకుని సురక్షిత ప్రదేశాల్లో వదిలిపెడతారు.  కుత్బుల్లాపూర్‌లో సైతం గురువారం ఓ కొండచిలువ రోడ్డు మీద‌కు వచ్చింది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ కార్పొరేషన్ పరిధి ప్రగతినగర్ అంబీరు చెరువు కట్ట వద్ద రోడ్డుపై ఈ 8 అడుగుల కొండచిలువ క‌నిపించ‌డంతో దారిలో వెళ్లేవారు ఫోటో క్లిక్‌మ‌నిపించారు. 







ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial