TSRTC Hikes Luggage Charges: ఇటీవలే కొద్ది రోజుల క్రితం డీజిల్ సెస్ పేరుతో ఆర్టీసీ టికెట్ ధరలను పెంచింది. ఇప్పుడు మరో సేవపై ధరలు పెంచింది. లగేజీ ఛార్జీలను భారీగా పెంచుతూ తెలంగాణ ఆర్టీసీ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ పెరిగిన ఛార్జీలు శుక్రవారం నుంచి అమలులోకి రానున్నాయి. ప్రయాణికుల టికెట్  ఛార్జీలను పెంచినప్పటికీ, ఆర్టీసీ బస్సుల్లో తీసుకెళ్లే లగేజీ ఛార్జీలు చాలా కాలంగా పెంచలేదని అందుకే తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా టీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు.


Also Read: పోలవరం కేంద్రంగా మళ్లీ విభజన సెంటిమెంట్ పాలిటిక్స్ - వర్కవుట్ అవుతుందా ?


చాలా కాలంగా ఒకేలా ఉన్న ఈ ఛార్జీలు పెంచాలని ఇటీవల జరిగిన టాస్క్‌ఫోర్స్‌ మీటింగ్ లో చర్చించి, ఈ పెంపు నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపారు. చివరిసారిగా అంటే 2002 లో లగేజీ ఛార్జీలను పెంచారు. ఆ తర్వాత లగేజీ ఛార్జీలు పెంచినట్లు లేదు. డీజిల్‌ ధరలతో పాటు ఉద్యోగుల జీతాలు పెరగడం, ఇతర నిర్వహణ ఖర్చులు పెరగడంతో లగేజీ ఛార్జీలను పెంచాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. 


అయితే, ఆర్టీసీ కార్గో సేవలను ప్రోత్సహించేందుకు గానూ ఆ ఛార్జీలతో సమానంగా లగేజీ ఛార్జీలను కూడా ఆ స్థాయికి పెంచామని టీఎస్ఆర్టీసీ ఉత్తర్వుల్లో ఉంది. ఈ ప్రభావంతో ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ట్రక్కు టైర్లు తరలించాలంటే ఇకపై దాన్ని 3 యూనిట్లుగా పరిగణించి ఛార్జీలు వసూలుచేస్తారు. టీవీ, ఫ్రిజ్‌, సైకిల్‌, ఫిలిం బాక్సులు, వాషింగ్‌ మెషీన్‌, కార్‌ టైర్లను రెండు యూనిట్లుగా పరిగణిస్తారు. రేడియో, ఖాళీ బ్యాటరీ, టేబుల్‌ ఫ్యాన్‌, 25 లీటర్ల ఖాళీ క్యాన్‌, కంప్యూటర్‌ మానిటర్‌లు, సీపీయూ, హార్మోనియం పెట్టెలను ఒక యూనిట్‌గా పరిగణిస్తారు. దాని ప్రకారమే టికెట్ రేటు తాజాగా పెంచినట్లుగా ఉత్తర్వుల్లో వివరించారు.


పెంచిన ఛార్జీలు ఇలా..
పల్లె వెలుగు బస్సుల్లో 25 కిలో మీటర్ల దూరంలోపు లగేజీ తీసుకెళ్తే ప్రస్తుతం రూపాయిగా ఉన్న ఛార్జీని రూ.20 కి పెంచారు. అలా రూ.2 ఉన్నదాన్ని రూ.40 కి, రూ.6 ఉన్న లగేజీ ఛార్జీని 125 కిలో మీటర్లు దాటితే రూ.90 చేశారు.


ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కూడా ప్రస్తుతం ఉన్న కనీస లగేజీ ఛార్జీ రూ.2 ను (50 కిలో మీటర్లలోపు) ఏకంగా రూ.50కి పెంచారు. రూ.4 (50 నుంచి 100 కిలో మీటర్లలోపు) ఉన్న లగేజీ ఛార్జీని రూ.70 చేశారు. గతంలో 500 కిలో మీటర్లు దాటితే రూ.24 ఉన్న లగేజీ ఛార్జీని ఇప్పుడు రూ.200 చేశారు.


Also Read: Daggubati Family Land Dispute : దగ్గుబాటి ఫ్యామిలీని వెంటాడుతున్న భూ వివాదం - బెదిరిస్తున్నారని కోర్టుకెక్కిన వ్యాపారి !