Polavaram Politics : అనూహ్యంగా జరిగే పరిణామాలతో రాజకీయాలు మారిపోతాయని మనం అనుకుంటాం కానీ ఒక్కో సారి ఈ పరిణామాలు కూడా వేగంగా ముందే అనుకున్నట్లుగా మారిపోతూ ఉంటాయి. అదే రాజకీయం అని సరి పెట్టుకోవాలి. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ మధ్య ప్రారంభమైన పోలవరం పంచాయతీ కూడా చివరికి సెంటిమెంట్ పాలిటిక్స్ దగ్గరకు తీసుకెళ్తోంది. భద్రాచలం చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామాలు ఏపీలో కలిపారని.. అక్కడ ఏపీ ప్రభుత్వం ఎలాంటి సహాయకార్యక్రమాలు చేపట్టలేదని.. తామే ప్రజల్ని ఆదుకున్నాం కాబట్టి వాటిని తెలంగాణలో కలిపేయాలని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. అంతే కాదు పోలవరం ఎత్తుపైనా ప్రకటనలు చేశారు. ఇలా పువ్వాడ మాట్లాడగానే అలా ఏపీ నుంచి ఇద్దరు మంత్రులు పోటీగా తాము సమైక్య రాష్ట్రం కోరుతామని డిమాండ్ చేశారు. ఇంత వేగవంతమైన రియాక్షన్ ఊహించనిదైదే.. మళ్లీ విభజన పాలిటిక్స్‌ను పెంచేలా ఈ కామెంట్లు ఉండటంతో రాజకీయవర్గాల్లో కొత్త చర్చ ప్రారంభమయింది.
పువ్వాడ ఎప్పుడూ చెప్పేదే చెప్పారు - వైఎస్ఆర్‌సీపీ నుంచి అంత సీరియస్ రియాక్షన్ ఏందుకు ?
పోలవరం ముంపు గురించి.. విలీన మండలాల గురించి మంత్రి పువ్వాడ అజయ్ కొత్తగా చెప్పిందేమీ లేదు. అది టీఆర్ఎస్ విధానం. పోలవరం ఎత్తు తగ్గించాలని.. విలీన మండలాలను మళ్లీ తెలంగాణలో కలపాలని టీఆర్ఎస్ నేతలు పలుమార్లు డిమాండ్ చేశారు. ఇప్పుడు అదే మాటలను మంత్రి పువ్వాడ అజయ్ చెప్పారు. అయితే మంత్రి ఇదేదే కొత్త డి్మాండ్ లేవదీశారన్నట్లుగా మంత్రి బొత్స సత్యనారాయణ వెంటనే ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్లు అలా అడిగితే తాము సమైక్య రాష్ట్రం కోరతామన్నారు. హైదరాబాద్ కావాలంటాలమన్నారు. మరో మంత్రి అంబటి రాంబాబుదీ ఇదే వాదన. తీవ్ర స్థాయిలో విరుచుకుపడి.. ఎక్కువగా ప్రకటనలు చేస్తే సమైక్య రాష్ట్ర్ కోసం డిమాండ్ చేస్తామన్నట్లుగా వారి ప్రకటలు ఉన్నాయి. అయితే ఎప్పుడూ లేనిది ఇంత ఎక్కువగా ఎందుకు స్పందించారన్నది పజిల్‌గానే ఉంది.
పోలవరం ఎత్తు తగ్గిస్తానని జగనే ఒప్పుకున్నారని అసెంబ్లీలో చెప్పిన కేసీఆర్ !
నిజానికి పోలవరం ఎత్తును తగ్గించాలనేది తెలంగాణ ప్రభుత్వ డిమాండ్. అందులో దాపరికం ఏమీ లేదు. డిజైన్లు మార్చాలని కొంత మంది అంటూ ఉంటారు. ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పడన కొత్తలో కేసీఆర్- జగన్ మధ్య ఇరిగేషన్ పై కొన్ని సమావేశాలు జరిగాయి. అందులో తెలంగాణ భూభాగంలో ఉమ్మడిగా ఓ ప్రాజెక్ట్ కట్టాలనే నిర్ణయానికి వచ్చారు. కానీ తర్వాత ఆ విషయంపై అడుగు ముందుకు పడలేదు. కానీ పోలవరం ఎత్తు తగ్గించేందుకు సీఎం జగన్ అంగీకరించారని కేసీఆర్ ప్రకటించారు. ఆఫ్ ది రికార్డో.. ఎన్నికల సభల్లోనే చెబితే.. అది రాజకీయం అనుకోవచ్చు. కానీ నేరుగా అసెంబ్లీలోనే చెప్పారు. అయితే అప్పట్లో వైఎస్ఆర్‌సీపీ నేతలెవరూ పెద్దగా స్పందించలేదు. కానీ ఇప్పుుడు మాత్రం పువ్వాడ అజయ్ అనగానే ఇంతెత్తున లేస్తున్నారు.
రాజకీయంగా వైఎస్ఆర్‌సీపీ, టీఆర్ఎస్ దోస్తానా !
రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఎవరికి వారు పోరాడుకుంటున్నారు కానీ రాజకీయానకి వచ్చే సరికి టీఆర్ఎస్, వైఎస్ఆర్‌సీపీ పరస్పర అవగాహనతో ఉన్నాయని చెబుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో రెండు పార్టీలదీ వేర్వేరు బాట అయినా ఎవరి నిర్ణయంలో ఎవరూ జోక్యం చేసుకోలేదు. ఇటీవల మంత్రి కేటీఆర్.. ఏపీ సీఎం జగన్ తనకు పెద్దన్న లాంటి వారని చెప్పుకున్నారు.
వ్యూహాత్మకంగా కలిసి సెంటిమెంట్ పెంచుకునే ప్రయత్నాలా ?
రాజకీయాల్లో సెంటిమెంట్‌ను మించిన అస్త్రం ఉండదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో. ఎన్నికల సీజన్ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల్లో అజెండా కోసం టెస్టింగ్స్ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణ మధ్య విభజన రాజకీయం ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో అని వైఎస్ఆర్‌సీపీ, టీఆర్ఎస్ టెస్ట్ చేసుకుంటున్నాయన్న చర్చ నడుస్తోంది. గతంలోనూ ఇలాంటి వివాదాలు వచ్చాయి. ఆ సమయంలో మళ్లీ చాన్సిస్తే తెలంగాణ, ఏపీ కలిపేస్తారని టీఆర్ెస్ నేతలు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు, హరీష్ రావు, కేటీఆర్ లాంటి వాళ్లు కూడా వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ విజయాలన్నీ సెంటిమెంట్ కేంద్రబిందువుగానే ఉన్నాయి. అటు ఏపీలోనూ ఇలాంటి సెంటిమెంట్ పెంచితే ఉభయతారకం అవుతుందన్న ఉద్దేశంతో కొత్త వివాదం ప్రారంభించారన్న అనుమానాలు రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే ఇది నిజమా కాదా అనేది మాత్రం ఎప్పటికీ బయటకొచ్చే చాన్స్ లేదు.