Governer On Cloud Burst : గోదావరికి వచ్చిన వరదల వెనుక క్లౌడ్ బరస్ట్ కుట్ర ఉందని.. దీని వెనుక ఇతర దేశాలు ఉన్నాయని తెలంగాణ సీఎం కేసీఆర్ అనుమానం వ్యక్తం చేయడం ఇంకా చర్చనీయాంశంగానే ఉంది. తెలంగాణ గవర్నర్ తమిళిసై ఈ అంశంపై సూటిగా స్పందించారు. సీఎం కేసీఆర్ గురించి మాట్లాడకుండానే క్లౌడ్ బరస్ట్‌పై తన అభిప్రాయాలను సూటిగా చెప్పారు. గోదావరికి వచ్చిన వరదల వెనుక క్లౌడ్ బరస్ట్ లేదని స్పష్టం చేశారు. అవి ఎప్పుడూ వచ్చే వరదలేనని కాకపోతే ఈ సారి కాస్త ఎక్కువగా వచ్చాయన్నారు. అంత మాత్రాన క్లౌడ్ బరస్ట్ అనలేమని స్పష్టం చేశారు.
పువ్వాడని తన సంగతేంటో చూసుకోమనండి, ఉమ్మడి రాష్ట్రం కావాలని మేమూ డిమాండ్ చేస్తాం: బొత్స
గవర్నర్ , తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ఇటీవలి కాలంలో సంబంధాలు అంత గొప్పగా లేవు. వరదలు వచ్చిన తర్వాత గవర్నర్ తమిళిసై వేగంగా స్పందించి ముందు ప్రాంతాల సందర్శనకు వెళ్లారు. ప్రభుత్వం ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాట్లు చేయకపోయినా ఆమె ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. అయితే సహాయ కార్యక్రమాలపై ఎలాంటి విమర్శలు చేయలేదు. కానీ ఆమె పర్యటనపై టీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. గవర్నర్ పర్యటించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. అయితే ఈ విమర్శలను గవర్నర్ పట్టించుకోలేదు.
తమిళిసై ఇటీవలి కాలంలో ప్రభుత్వంపై కొన్ని విమర్శలు చేశారు. తనకు గౌరవం ఇవ్వడం లేదన్నారు. రాజ్ భవన్‌లో ప్రజాదర్బార్ వంటి కార్యక్రమం పెట్టడంపై టీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. రాజ్ భవన్‌లో రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. అయితే ఆ తర్వాత ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయన్న సంకేతాలు వచ్చాయి. చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాజ్ భవన్ కు కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌తో ఎలాంటి విభేదాలు లేనట్లుగానే కేసీఆర్ వ్యవహరించారు.
జగన్ సర్కార్‌కు ఏపీ హైకోర్టు మరో షాక్! ఆ పిటిషన్ కొట్టివేత, ఈయనకు గొప్పఊరట
అయితే ఇప్పుడు మళ్లీ సీఎం, మంత్రుల కంటే ముందే తమిళిసై వరద ప్రాంతాల పరిశీలనకు వెళ్లడంతో మరోసారి విభేదాలు బయటపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. క్లౌడ్ బరస్ట్‌పై సీఎం కేసీఆర్ అభిప్రాయాను కూడా నేరుగానే తోసిపుచ్చడంతో టీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.