Polavaram Height Issue: పోలవరం ఎత్తు ఎప్పుడూ పెంచలేదని, అది ముందు అనుకున్న డిజైన్ ప్రకారం నిర్మాణం అవుతుందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సీడబ్ల్యూసీ పర్మిషన్ లేకుండా అక్కడ కొత్త ఏమీ జరగడం లేదని వివరణ ఇచ్చారు. విభజన చట్టంలో ఉన్న అంశాలప్రకారమే జరుగుతోందని అన్నారు. ఆ డిజైన్ ప్రకారం భద్రాచలానికి ఎలాంటి ముప్పు లేదని అన్నారు. ప్రస్తుతం భద్రాచలంలో వందేళ్ల చరిత్రలోనే వచ్చిన అధిక వరదలు కాబట్టి, అంతగా అక్కడి ప్రాంతాలు ప్రభావితం అయ్యాయని అన్నారు. 


రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ తెలంగాణకు పోవడం వల్ల ఆంధ్రాకు బాగా నష్టం జరిగింది. అందుకని హైదరాబాద్‌ను కూడా ఆంధ్రాకు కలపాలని, ఇంతకుముందులా ఉండాలని అడిగితే బాగుంటదా? ఉమ్మడి రాష్ట్రంగా ఉంటే ఎలాంటి అభ్యంతరం ఉండదు. కాబట్టి, అన్నీ అవివేకమైన మాటు. ఎక్కడైనా ప్రజలే ప్రభావితం అయ్యేది. అందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఆలోచించాలి. కాబట్టి, ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. 


పువ్వాడ అజయ్.. అతని సంగతి అతను చూసుకోమనండి. మా రాష్ట్రంలో విలీనం అయిన గ్రామాల బాధ్యత పూర్తిగా మాదే. ఖమ్మం జిల్లా గురించి చూసుకోమనండి. పక్క రాష్ట్రాల గురించి కామెంట్ చేయడం బాధ్యతగల వ్యక్తికి తగదు. మాకు ఒకరు చెప్పాలా? అన్ని విషయాలు మాకు తెలుసు. ఇప్పటికే మా ప్రభుత్వం అన్ని సక్రమమైన పనులు చేస్తూ ఎవరికీ ఇబ్బందుల్లేకుండా చేస్తున్నాం. 


ఒకవేళ పార్లమెంటులో ఆ 5 గ్రామాలను మళ్లీ తెలంగాణలో కలపాలనే బిల్లును తీసుకొస్తే, మళ్లీ రెండు రాష్ట్రాలనీ కలపాలనే డిమాండ్‌ని మేమూ తీసుకొస్తాం. అందులో తప్పేముంది.’’ అని బొత్స సత్యనారాయణ మాట్లాడారు.


పువ్వాడ ఏమన్నారంటే..


పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంపు వల్ల భద్రాచలానికి ముప్పు పొంచి ఉందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని డిమాండ్ చేశారు. పోలవరం బ్యాక్ వాటర్ వల్ల ఎన్నో గ్రామాలు వరద ముంపునకు గురవుతున్నాయని చెప్పారు. ఈ డ్యామ్ వల్ల గోదావరి వరద ప్రవాహం నెమ్మది అవుతోందని, భద్రాచలం వద్ద నీటి మట్టం పెరుగుతోందని చెప్పారు. పోలవరం డ్యామ్ ఎత్తును తగ్గించాలని గతంలోనే ఏపీ ప్రభుత్వాన్ని తాము కోరామని చెప్పారు. మంత్రి పువ్వాడ అజయ్ భద్రాచలంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు.


సీఎం జగన్ గురించి పరోక్షంగా మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఎవరు శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరని మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యానించారు. పోలవరం విషయంలో మొదటి నుంచి ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. పోలవరం ఎత్తు తగ్గించేలా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని కోరారు. భద్రాచలం పక్కన ఉన్న ఐదు పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలను తెలంగాణ ప్రభుత్వమే ఆదుకుందని, పార్లమెంటులో బిల్లు పెట్టి వాటిని తక్షణమే తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు.