TSRTC Electric Buses: గ్రేటర్ జోన్ పరిధిలో వచ్చే నెల నుంచి విద్యుత్ బస్సులను నడిపాలని తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. కొత్తగా వచ్చే విద్యుత్ బస్సులను నగరంలో ఏయే మార్గాల్లో నడపాలనే దానిపై ఆర్టీసీ అధికారులు ఆన్ లైన్ సర్వే చేస్తున్నారు. ముఖ్యంగా ఏ మార్గంలో విద్యుత్ బస్సులు నడిపితే ఆక్యుపెన్సీ పెరుగుతుంది, పాత మార్గాల్లోనే వీటిని నడపాలా లేదా కొత్త మార్గాలను ఎంపిక చేయాలా అని ఆలోచిస్తుంది. అంతేకాకుండా మెట్రో రైళ్లు ఉన్న మార్గాల్లో నడిపితే లాభం ఉంటుందా అనే దానిపై ప్రజల స్పందన కోరుతున్నారు. ఇందుకోసమే ఆన్ లైన్ లో సర్వే నిర్వహించి.. ఆపై నిర్ణయం తీసుకోనున్నారు. ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయంతో వచ్చే ఆరు నుంచి ఏడాదిలోగా దాదాపు వెయ్యికి పైగా విద్యుత్ బస్సులను నడిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. 


ఇందుకోసం ఇప్పటికే ఒలెక్ట్రా కంపెనీతో కూడా ఆర్టీసీ యాజమాన్యం ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. నగరంలో నడిపించే విద్యుత్ బస్సులు నాన్ ఏసీగా ఉంటాయి. అందుకు సంబంధించిన నమూనా బస్సును ఇప్పటికే ఒలెక్ట్రా విడుదల చేసింది. అన్ని సక్రమంగా ఉంటే నగరంలో తొలి విడతగా 28 బస్సులను తీసుకురానున్నారు. నగరంలో వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు నగర ప్రజలకు ప్రాణవాయువు పెంచాలన్న లక్ష్యంతోనే ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను తీసుకు వస్తోంది. అయితే ప్రస్తుతం నగరంలో తిరుగుతున్న కాలం చెల్లిన బస్సులను స్క్రాప్ కు పంపించి.. వాటి స్థానంలో విద్యుత్ బస్సులను ఏర్పాటు చేస్తోంది. 



ఈ ఆర్థిక ఏడాదిలో సిటీలో 500 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి వస్తాయని, అందులో 50 ఏసీ బస్సులుండగా.. మిగతావి ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులు ఉన్నట్లు సజ్జనార్ వివరించారు. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (GCC) పద్ధతిలో విడతల వారీగా ఈ బస్సులను టీఎస్‌ఆర్టీసీకి ఒలెక్ట్రా అందజేస్తుందన్నారు. వీటికి అదనంగా మరో 800 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు ప్రక్రియ ప్రాసెస్‌లో ఉందన్నారు. కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రవీందర్, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు మునిశేఖర్, వెంకటేశ్వర్లు, కృష్ణకాంత్,  సీఎంఈ రఘునాథ రావు, సీఈఐటీ రాజశేఖర్, ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్‌ రావు, మేనేజర్ ఆనంద్‌ బసోలి, అసిస్టెంట్ మేనేజర్ యతిష్ కుమార్ పాల్గొన్నారు. 


ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సు ప్రత్యేకతలు ఇవే..!


12 మీటర్ల పొడవు ఉంటుంది. ఏసీ బస్సుల్లో హైటెక్ హంగులతో అందుబాటులోకి వస్తున్నాయి. 35 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ బస్సుల్లో మొబైల్ చార్జింగ్ సౌకర్యంతో పాటు సీటు బెల్ట్ సదుపాయం ఉంది. ప్రతి బస్సులోనూ మూడు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటికి ఒక నెల రికార్డింగ్‌ బ్యాకప్‌ ఉంటుంది. బస్సు రివర్స్‌ చేసేందుకు వీలుగా రివర్స్‌ పార్కింగ్‌ అసిస్టెన్స్‌ కెమెరా కూడా ఉంటుంది. గమ్యస్థానాల వివరాలు కోసం బస్సులో నాలుగు ఎల్ఈడీ బోర్డులను ఏర్పాటు చేశారు. 


అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్‌ డిటెక్షన్‌ సప్రెషన్‌ సిస్టం(ఎఫ్‌డీఎస్‌ఎస్‌)ను ఏర్పాటు చేశారు. ఈ బస్సులకు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 225 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు. ఫుల్ చార్జింగ్‌కు 2 నుంచి 3 గంటలకు సమయం పడుతుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా వెహికిల్‌ ట్రాకింగ్‌ సిస్టంతో పాటు ప్రతి సీటు వద్ద పానిక్‌ బటన్‌ సదుపాయం కల్పించారు.