TSRTC Ugadi Offer: ప్రయాణికుల మదిలో నమ్మకమైన స్థానం సంపాదించుకొనే దిశగా తెలంగాణ ఆర్టీసీ ముందుకు పోతోంది. సీజన్లకు తగ్గట్లుగా స్పెషల్ బస్సుల ఏర్పాట్ల దగ్గర్నుంచీ.. ప్రతి పండక్కి ఏదో ఒక ఆఫర్ ప్రకటిస్తూ ప్రత్యేకత చాటుకుంటోంది. తరచూ ప్రచారం లేదా ఆఫర్ల విషయంలో ఏదో ఒక వైవిధ్యం కనబరుస్తూ నిత్యం వార్తల్లో ఉండేలా చూసుకుంటోంది. ఇప్పుడు ఉగాది పండక్కి కూడా అలాంటి ఆఫర్‌తోనే తెలంగాణ ఆర్టీసీ ముందుకొచ్చింది.
తెలంగాణ ప్రజలకు టీఎస్‌ఆర్టీసీ ఉగాది ఆఫర్ ప్రకటించింది. ఏప్రిల్ 2న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 65 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్స్ అందరూ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా ప్రకటించారు. కేవలం ఏప్రిల్ రెండో తేదీ ఉగాది పండుగ సందర్భంగా మాత్రమే ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. బస్సుల్లో ప్రయాణించేటపుడు తమ దగ్గర ఉన్న గుర్తింపు కార్డును (65 ఏళ్లు దాటినట్లు ఏదైనా వయసు ధ్రువీకరణ పత్రం) బస్సులోని కండక్టర్‌కు చూపించి ఉచితంగా ప్రయాణం చేయవచ్చని సూచించింది.
Hyderabad Metro కూడా..
హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ (Hyderabad Metro Rail) జనం మెచ్చే సరికొత్త భారీ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.59 ధర చెల్లించి ఒక రోజులో ఎక్కడి నుంచి మరెక్కడికైనా ఎన్నిసార్లైనా తిరిగే వెసులుబాటు కల్పించింది. అయితే, ఈ ఆఫర్ అన్ని రోజుల్లో వర్తించదు. కొన్ని నిర్దేశిత సెలవు రోజుల్లో మాత్రమే వర్తించనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రకటించింది. ‘సూపర్ సేవర్ కార్డు’ (Super Saver Card) పేరుతో ఈ ఆఫర్‌ను ప్రవేశపెడుతున్నట్లుగా ఎల్ అండ్ టీ మెట్రో రైలు ఎండీ కేవీబీ రెడ్డి ప్రకటించారు. ఈ సూపర్ సేవర్ కార్డును ఆయనే గురువారం ప్రారంభించారు.
ఈ కార్డుతో సెలవుల్లో కేవలం రూ.59 చెల్లించి రోజంతా మెట్రో రైలులో ప్రయాణించవచ్చని కేవీబీ రెడ్డి వెల్లడించారు. నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రోజంతా తిరగొచ్చని చెప్పారు. మెట్రో వర్గాలు ప్రకటించిన 100 రోజుల సెలవుల్లోనే ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించారు.
ఆ సెలవు రోజులు ఏంటంటే..
నెలలో ప్రతి ఆదివారం, ప్రతి రెండోది, నాలుగో శనివారం రోజులు సెలవులుగా పేర్కొంది. అంతేకాక, ఉగాది, రంజాన్, మొహర్రం, బోనాలు, ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం, వినాయక చవితి, కృష్ణాష్టమి, దుర్గాష్టమి, దసరా, దీపావళి, డిసెంబరు 26 బాక్సింగ్ డే, బోగీ, సంక్రాంతి, శివరాత్రి రోజుల్లో మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని కేవీబీ రెడ్డి తెలిపారు.