Drugs in Hyderabad: హైదరాబాద్‌లో డ్రగ్స్ వాడకం వల్ల ఓ యువకుడు చనిపోయాడు. రెండ్రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాదకద్రవ్యాల వాడకంతో హైదరాబాద్‌లో చనిపోయిన తొలి వ్యక్తి ఇతనే. బీటెక్ చదువుతున్న ఇతను తరచూ గోవాకు వెళ్లడం, అక్కడ డ్రగ్స్ తీసుకోవడం వంటివి చేసేవాడు. ఈ క్రమంలోనే మత్తుకు బానిసై డ్రగ్స్‌కు (Drugs) బాగా అలవాటుపడ్డాడు. దీంతో విద్యార్ధి పేషెంట్‌గా మారాడు. వారం రోజుల్లోనే తీవ్ర అస్వస్థతకు గురై విద్యార్థి తాజాగా మృతి చెందాడు. గతంలో గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్‌లో అమ్ముతున్న యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ అయిన వారిలో ఈ చనిపోయిన యువకుడు కూడా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన విద్యార్ధి ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్‌లో ఇతరులకు అమ్మేవాడని పోలీసులు వెల్లడించారు.


డోస్ ఎక్కువ కావడం వల్లే..
రెండ్రోజుల క్రితం నల్లకుంట (Nallakunta) పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఓ ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి దగ్గర డ్రగ్స్‌ కొంటున్న మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. నార్కొటిక్ వింగ్ పోలీసులు వీరి నుంచి 6 ఎల్ఎస్డీ బోల్ట్స్, 10ఎక్స్టాసి పిల్స్, 100 గ్రాముల హాష్ ఆయిల్, 4 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నలుగురూ తరచూ గోవా వెళ్తుంటారు. అయితే, ఈ నలుగురితో కలిసి బీటెక్‌ విద్యార్థి కూడా గోవా వెళ్లాడు. ఆ విద్యార్థి వేరు వేరు రకాల మాదకద్రవ్యాలను ఒకేసారి వాడేశాడు. అలా డోసేజీ బాగా ఎక్కువై విద్యార్థికి మెదడు స్తంభించి వింత మనిషిగా ప్రవర్తించాడు. 


ఇంట్లోని వారు అతని ప్రవర్తనతో ఆస్పత్రిలో చేర్పించినా కోలుకోలేదు. చికిత్స పొందుతూనే రెండు రోజుల క్రితం మృతి చెందాడు. ఇతనితో వెళ్లిన మిగతా వారు  కూడా అనారోగ్యంతో మంచం పట్టినట్లు సమాచారం. 


డాక్టర్లు ఏం చెప్పారంటే..
డ్రగ్స్ తీసుకున్న బీటెక్ స్టూడెంట్‌కు (B Tech Student) ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్లు కీలక విషయాలు వెల్లడించారు. మొదట అతని ఆరోగ్య స్థితి తమకు అర్థం కాలేదని, అతని స్నేహితులను ఆరా తీస్తే అసలు విషయం చెప్పినట్టు డాక్టర్లు తెలిపారు. అధిక మాదకద్రవ్యాల డోసేజీ వల్ల మెదడుపై దారుణమైన ప్రభావం చూపిందని తెలిపారు. మెదడు మొత్తం మొద్దుబారిపోవడం వల్ల బ్రెయిన్​ స్ట్రోక్​ వచ్చి, శరీరంలోని అవయవాలన్ని పనిచేయటం మానేశాయని అన్నారు. ఏళ్లుగా మత్తు పదార్ధాలు సేవిస్తుండటం వల్లే తీవ్ర అనారోగ్యం పాలయ్యాడని వైద్యులు పేర్కొన్నారు.