తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC)లో క్వశ్చన్ పేపర్ల లీక్ వ్యవహారంలో కొనసాగుతున్న విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఉద్యోగి ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తిని కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల మరిన్ని వివరాలు బయటికి వస్తాయని అనుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని కీలక వివరాలు బయటికి వచ్చాయి. 


నిందితుడు ప్రవీణ్‌ కుమార్ టీఎస్పీఎస్సీలో 2017లో జూనియర్‌ అసిస్టెంట్‌గా చేరాడు. అక్కడే నాలుగేళ్ల పాటు వెరిఫికేషన్‌ డిపార్ట్ మెంట్ లో విధులు నిర్వహించాడు. అలా వెరిఫికేషన్ విభాగానికి వచ్చే మహిళల ఫోన్ నెంబర్లను సేకరించేవాడు. వెరిఫికేషన్ విభాగానికి వచ్చే మహిళలకు దరఖాస్తులో భాగంగా వచ్చే సమస్యలను పరిష్కరించేవాడు. అలా వారితో మాటలు కలిపి సాన్నిహిత్యం పెంచుకొని కొంత మంది మహిళలతో శారీరక సంబంధం పెట్టుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రవీణ్‌ సెల్‌ఫోన్‌లో ఎక్కువగా ఆడవారి ఫోన్ నెంబర్లు గుర్తించారు. వాట్సాప్‌ ఛాటింగ్‌లోనూ మహిళల న్యూడ్ ఫొటోలు, వీడియోలు కూడా పోలీసులు గుర్తించారు. ఏఈ పరీక్ష పత్రం కూడా రేణుక అనే ఓ యువతి కారణంగానే లీక్‌ అయిందని పోలీసులు తేల్చారు.


టౌన్ బిల్డింగ్ ప్లానింగ్ ఆఫీసర్ పరీక్ష, ఈ నెల 15న జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పరీక్షలకు సంబంధించిన పేపర్‌ లీకేజీ వ్యవహారం దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ప్రవీణ్ కుమార్ నుంచి క్వశ్చన్ పేపర్ ను కొన్నట్లుగా భావిస్తున్న ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. వీరి నుంచి పేపర్లు కొనుగోలు చేసినట్టుగా సమాచారం ఉన్న మరో నలుగురు అభ్యర్థులను కూడా విచారణ చేస్తున్నారు. అయితే, ఈ పేపర్ లీక్ కుంభకోణంలో ప్రవీణ్ కుమార్ ఒక్కరే ఉన్నారా? లేక టీఎస్పీఎస్సీలోని ఇతర ఉద్యోగులు కూడా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకోసం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులను రంగంలోకి దించారు.