తెలంగాణలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా క్రమంగా ఎదుగుతున్న భారతీయ జనతా పార్టీలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అధ్యక్షుడిపై సొంత పార్టీ నేతలే వ్యతిరేక గళం వినిపించారు. ఇన్నాళ్లూ కలిసికట్టుగా ఉన్నట్లు కనిపించిన కమలం పార్టీలో లుకలుకలు బట్టబయలు అయ్యాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గ విభేదాలు, టీపీసీసీతో సంబంధం లేకుండా ఎవరికి వారు తామే అధ్యక్షులుగా భావించడం వంటి పరిణామాలతో ఆ పార్టీకి తీరని నష్టం కలుగుతున్న సంగతి తెలిసిందే. ఇది కూడా బీజేపీ ప్రాభవం పెరిగేందుకు బాగా కలిసివచ్చింది. తాజాగా బీజేపీలోనే వ్యతిరేక గళం వినిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది.


బండి సంజయ్ వ్యాఖ్యలను తప్పుబట్టిన అర్వింద్
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరు కావడం గురించి స్పందిస్తూ.. కాస్త అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ‘‘కవితను విచారిస్తరు.. లేకుంటే ముద్దు పెట్టుకుంటరా’’ అని మాట్లాడారు. ఆ పదబంధం ప్రతిఒక్కరూ ఏదో ఓ సందర్భంలో వాడేదే అయినప్పటికీ, అలా అనడంపై బీఆర్ఎస్ నేతలు తప్పుబట్టారు. మహిళపై అలాంటి వ్యాఖ్యలు ఏంటని విరుచుకుపడ్డారు. 


ఆ వ్యాఖ్యలనే ఇప్పుడు సొంత పార్టీకి చెందిన తోటి ఎంపీ ధర్మపురి అర్వింద్ కూడా తప్పుబట్టారు. కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తాను సమర్థించబోనని అర్వింద్ స్పష్టం చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలు బీజేపీకి సంబంధిచినవి కావని అన్నారు. కేవలం ఆయన వ్యక్తిగతమేనని అన్నారు. ఆయన వ్యాఖ్యలకు ఆయనే సమాధానం చెప్పాలని తెలిపారు. వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటే మంచిదంటూ అర్వింద్ మాట్లాడారు. అసలే కల్వకుంట్ల కవితపై తరచూ తీవ్ర వ్యాఖ్యలు చేసే అర్వింద్ ఆమె విషయంలోనే బండి సంజయ్‌ను తప్పుబట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. 


అర్వింద్‌కే మద్దతు పలికిన మరో బీజేపీ నేత
ఆర్వింద్‌ వ్యవహరించిన తీరు వ్యాఖ్యలు వంద శాతం కరెక్టు అంటూ బీజేపీ మాజీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, సీనియర్‌ నేత పేరాల శేఖర్‌రావు కూడా సోషల్‌ మీడియా ద్వారా స్పందించారు. ముఖ్య నేతలైన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్‌ వంటి పెద్దలు చేయాల్సిన పనినే అర్వింద్‌ చేశారని శేఖర్‌రావు సోషల్‌ మీడియా పోస్ట్‌లో రాశారు. అధ్యక్షుడు సంజయ్ పరిణతిలేని అసందర్భ మాటలు, నియంతృత్వం, అప్రజాస్వామిక చేష్టలు బీజేపీలో ప్రస్తుత పరిస్థితి కారణమని విమర్శించారు. పార్టీలో వినే సంస్కృతి, చర్చించే పద్ధతి మాయమైనప్పుడు సోషల్‌ మీడియానే ఆధారమవుతోందని శేఖర్‌రావు తెలిపారు.


అసలే అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో కవితపై బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేకపోయినా అర్వింద్‌ ప్రెస్ మీట్‌ పెట్టి మరీ తప్పుబట్టడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. అర్వింద్‌ వ్యాఖ్యలకు కొనసాగింపుగా బండి సంజయ్‌పై శేఖర్‌రావు మరిన్ని తీవ్ర విమర్శలు, ఆరోపణలు సంధించడంతో తెలంగాణ బీజేపీ నేతల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.


అధిష్ఠానం మేల్కొటుందా?
ఇప్పటికే జరిగిన నష్టంపై ఢిల్లీలోని బీజేపీ అధిష్ఠానం సత్వరమే స్పందిస్తుందా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. బండి సంజయ్‌పై పార్టీ సహచర ఎంపీ అర్వింద్‌ బహిరంగ విమర్శలు చేయడంపై ఇప్పటికే పంచాయితీ ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో అర్వింద్‌కు క్రమశిక్షణ ఉల్లంఘన నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయని సమాచారం.