వివేకానంద రెడ్డి హత్య కేసులో నాలుగో సారి సీబీఐ విచారణకు వైఎస్ అవినాష్ రెడ్డి హాజరు అయ్యారు. ఈసారి ఆయన ఇద్దరు న్యాయవాదులను వెంట తీసుకొని వెళ్లారు. ఎస్పీ రామ్ సింగ్ ఆధ్వర్యంలో అవినాష్ రెడ్డి విచారణ జరగనుంది.
అంతకుముందు అవినాష్ రెడ్డి నేడు తాను విచారణకు రాలేనని సీబీఐకి లేఖ రాశారు. పార్లమెంటు సమావేశాలు ఉన్నందున తనకు విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని అవినాష్ రెడ్డి లేఖ రాసినా సీబీఐ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆయన హాజరవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే సీబీఐ మూడుసార్లు అవినాష్ రెడ్డిని విచారణ చేసింది. గత విచారణ సందర్భంగా కూడా సుదీర్ఘంగానే ఆయన్ను అధికారులు ప్రశ్నించారు. అవినాష్ రెడ్డి సరైన సమాధానాలు చెప్పడానికి ఇష్టపడకపోవడం, పొంతన లేకపోవడంతో నేడు మళ్లీ విచారణకు హాజరుకావాలని సీబీఐ అవినాష్ రెడ్డికి సూచించింది.
నిన్ననే కోర్టు ఆదేశాలు
ఎంపీ అవినాష్ రెడ్డిపై తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు సీబీఐని నిన్న (మార్చి 13) ఆదేశించిన సంగతి తెలిసిందే. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన కోర్టు తీర్పును కూడా రిజర్వ్ చేసింది. గత ఆదేశాల మేరకు వివేకా హత్య కేసులో ఎంపీ పాత్రపై ఆధారాలను సీబీఐ సమర్పించింది. దర్యాప్తు కీలకదశలో ఉన్నందున స్టే ఇవ్వొద్దని వాదించింది. ఇవాళ సీబీఐ విచారణకు మినహాయింపు ఇవ్వాలన్న ఎంపీ అభ్యర్థనను కూడా కోర్టు తిరస్కరించింది. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ ప్రక్రియను ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని, తనపై కఠిన చర్యలు తీసుకోకుండా ఉండటంతో పాటు విచారణకు పిలవకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో నిన్న విచారణ జరిగింది. జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేశారు. గత విచారణలో కోర్టు ఆదేశాల మేరకు వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రకు సంబంధించిన అన్ని ఆధారాలను సీబీఐ సమర్పించింది.
తెలంగాణ హైకోర్టుకు వివేకా హత్య కేసు విచారణ వివరాలు
హత్య కేసుకు సంబంధించిన దర్యాప్తు స్థాయి నివేదిక, హార్డ్ డిస్క్, 10 డాక్యుమెంట్లు, 35 మంది సాక్షుల వాంగ్మూలాలతో పాటు.. వివేకా డెత్ నోట్, ఫోరెన్సిక్ నివేదిక, ఘటనా స్థలంలో ఆధారాలు చెరపకముందు తీసిన ఫొటోలు, కేసు డైరీ వివరాలను సీల్డ్ కవర్‌లో అందజేసింది. హత్యా స్థలిలో సాక్ష్యాల ధ్వంసంలో అవినాష్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సీబీఐ తరఫు న్యాయవాదులు అనిల్‌కుమార్, నాగేంద్రన్ హైకోర్టుకు నివేదించారు. కోర్టు అడిగిన అన్ని పత్రాలను, రికార్డులను సమర్పించామని, దీనిపై త్వరగా తేల్చి దర్యాప్తునకు అనుమతించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దర్యాప్తు కీలక దశలో ఉందని, ఈ సమయంలో నిలిపివేయవద్దని సీబీఐ అధికారులు విన్నవించారు.
ఆధారాలు ధ్వంసం చేయడంలో అవినాష్ ది కీలక పాత్ర
వివేకా హత్య సమయంలో రాసిన లేఖను ఎఫ్ఎస్ఎల్ కు పంపి నివేదిక తెప్పించి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సీబీఐ తెలిపింది. వివేకా రాత నమూనాను పరీక్షించి.. దానికి సంబంధించి ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ వెల్లడించిన అభిప్రాయాన్ని సమర్పించామని పేర్కొంది. ఏ అంశాన్నీ వదిలి పెట్టడం లేదని నివేదించింది. హత్య జరిగిన రోజు 5 గంటల నుంచి 7 గంటల మధ్య ఘటనా స్థలంలో ఆధారాలు ధ్వంసం చేయడానికి అవినాష్ రెడ్డి ప్రయత్నించారని న్నారు. ఈ కేసు గురించి పూర్తి సమాచారం అవినాష్ వద్ద ఉందన్నారు.