గ్రూప్ -1 ప్రిలిమ్స్ రద్దుపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ న్యాయపోరాటానికి సిద్ధపడింది. ఈ నెల 23న సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. దీన్ని అత్యవసరంగా విచారించాలని లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. దీనిపై మంగళవారం విచారిస్తామని హైకోర్టు టీఎస్పీఎస్సీకి తెలిపింది.
23న తెలంగాణలో మరోసారి గ్రూప్‌వన్ పరీక్ష ప్రిలిమ్స్ రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. మరోసారి నిర్వహించాలని సూచించింది. జూన్ 11న గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రెండోసారి నిర్వహించారు. అందులో కూడా అక్రమాలు జరిగాయని కొందరు అభ్యర్థులు కోర్టు మెట్లు ఎక్కారు. 503 పోస్టులతో విడుదల చేసిన నోటిఫికేషన్ కోసం రెండుసార్లు ఎగ్జామ్ రాశారు. లీకేజీ ఆరోపణలతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొదటి సారి గ్రూప్ - 1 పరీక్షను రద్దు చేసింది. పకడ్బంధీగా రెండోసారి నిర్వహించాలని భావించారు.
రెండోసారి పరీక్ష నిర్వహణలో కూడా లోపాలు తలెత్తాయి. వీటిని పాయింట్ అవుట్ చేస్తూనే కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లారు. పరీక్షలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని... హాల్ టికెట్ నంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం పరీక్షను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. వీలైనంత త్వరగా మరోసారి పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది.