జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ముందు మాజీ మంత్రి కడియం శ్రీహరితో కలిసిపోయినట్లే కనిపించిన రాజయ్య, తాజాగా మాట మార్చేశారు. జనగామ జిల్లా లింగాల ఘన్‌పూర్‌ మండలం వడ్డిచర్లలో ఆదివారం అంబేడ్కర్ విగ్రహావిష్కరణ అనంతరం రాజయ్య మాట్లాడారు. కాలం నిర్ణయిస్తే బరిలో ఉంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ఎన్ని రూమర్స్ వచ్చినా గాబరా పడొద్దని,. బీఆర్ఎస్ తరపున టికెట్ తనదేని, గెలుపు కూడా తనదేనని స్పష్టం చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయని సీఎం కేసీఆర్ 115 టికెట్లు కేటాయించారని రాజయ్య అన్నారు.  అభ్యర్థులను ప్రకటించినా ఎవరికి బీ ఫామ్ లు ఇవ్వలేదన్నారు. 


కడియం శ్రీహరితో కలిసి పనిచేస్తానని ఎక్కడ చెప్పలేదన్నారు తాడికొండ రాజయ్య. కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య కలిసిపోయారని, తమ పరిస్థితి ఏంటని రెండు మూడు రోజులుగా ప్రజాప్రతినిధులు, నాయకులు అయోమయంలో పడిపోయారని అన్నారు. అయితే అక్కడ ఏమీ జరగలేదని, కేటీఆర్‌కి తనకు మధ్య సంభాషణ మాత్రమే జరిగిందన్నారు. కేటీఆర్ విదేశాలకు వెళ్లే ముందు స్వయంగా కలిసినప్పుడు గొప్పగా పని చేస్తున్నావని, కేసీఆర్ మరో మారు నీకే అవకాశం కల్పిస్తారని చెప్పడంతో ఆగిపోయానన్నారు. రెండ్రోజుల క్రితం కేటీఆర్‌ను కలిసినప్పుడు ఎమ్మెల్సీగా లేదా ఎంపీగా అవకాశం ఉంటుందని, అప్పటి వరకు నామినేటెడ్ పదవులు తీసుకోమని చెప్పినట్లు వెల్లడించారు. కేటీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో తీసిన ఫొటోల పెట్టి ఊహగానాలతో వార్తలు రాశారని అన్నారు. 


15 రోజుల క్రితం వరంగల్ లో జరిగిన మాదిగ ఇంటలెక్చవల్‌ ఫోరంలో మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి పాల్గొన్నప్పుడు, రాజయ్య కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారని రాశారో ఇది కూడా అంతేనన్నారు. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, 2014 ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా కడియం, ఎమ్మెల్యేగా తాను అధిష్ఠానం నిర్ణయం ప్రకారం పని చేశామన్నారు రాజయ్య.  2014, 2018 ఎన్నికల్లో పార్టీ నిబంధనల ప్రకారం ఇద్దరం కలిసి పని చేశామన్నారు రాజయ్య. 2023 ఎన్నికల్లో సైతం పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకే కలిసి పనిచేయాల్సి ఉంటుందన్నారు. అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ అభద్రతా భావం ఉండదని క్లారిటీ ఇచ్చారు. 


కొన్ని రోజుల కడియం శ్రీహరిపై తాటికొండ రాజయ్యపై సంచలన ఆరోపణలు చేశారు. కడియం శ్రీహరి దేవాదుల సృష్టికర్త కాదని, ఎన్‌కౌంటర్ల సృష్టికర్త అంటూ విమర్శించారు. 14 ఏళ్లు మంత్రిగి ఉండి ఏనాడూ కూడా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాన్ని కడియం శ్రీహరి పట్టించుకోలేదని మండిపడ్డారు.స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ ప్రజలు తన వెంటే ఉన్నారని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కడియంను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తితో పెళ్లి చేసుకున్న కడియం శ్రీహరి కూతురు ఎస్సీ కాదని, బీసీ బీ కులానికి చెందుతారని రాజయ్య వ్యాఖ్యానించారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో 85వేల ఎస్సీల ఓట్లు ఉంటే, అందులో 63 వేల ఓట్లు మాదిగలవే అని రాజయ్య స్పష్టం చేశారు. నియోజకవర్గంలో గొప్పగా పనిచేస్తున్న తాను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు రాజయ్య