TSPSC AE Exam Paper Leak Case:  టీఎస్ పీఎస్సీ నిర్వహించిన ఉద్యోగ నియామక పరీక్ష పేపర్ లీకేజీ కేసులో 9 మంది నిందితులని పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దాంతో నిందితులను చంచల్ గూడ జైలు కు పోలీసులు తరలిస్తున్నారు. అంతకుముందు 9 మంది నిందితులకు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఏఈ పేపర్ లీకేజీలో ప్రధాన నిందితుడు ప్రవీణ్ వ్యవహారంలో మరో కొత్త కోణం వెలుగు చూసింది. గతంలో జరిగిన గురుకుల ప్రిన్సిపల్‌ పోస్టులకు సంబంధించి ఆరోపణలు వస్తున్నాయి. ఎగ్జామ్ లో క్వాలిఫై అవ్వని వారికి సైతం రీ కరెక్షన్ పేరుతో పైరవీలు చేసి జాబ్స్ ఇప్పించాడని సరికొత్త ఆరోపణలు వస్తున్నాయి. లెక్చరర్‌గా పని చేయాలన్న నిబంధనలను పక్కనపెట్టి, పలువురు మహిళలకు ఫేక్ ఐడీ కార్డులు క్రియేట్ చేశాడని కొత్త కోణం వెలుగుచూసింది. 


టీఎస్ పీఎస్సీ ఆఫీసు ముట్టడికి యత్నం
నాంపల్లిలోని టీఎస్ పీఎస్సీ కార్యాలయన్ని అభ్యర్థులు, బీఎస్పీ నేతలు, విద్యార్థి సంఘాలు ముట్టడించే ప్రయత్నం చేశారు టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో బాధ్యులపై కఠిన తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆందోళనకారులను అడ్డుకుని గోషామహల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. టీఎస్ పీఎస్సీ ఆఫీసు వద్ద అదనపు బలగాలను మోహరించారు. ఓయూలోనూ విద్యార్థులు, అభ్యర్థులు ఆందోళనకు దిగారు. కమిషన్ చైర్మన్ ను సస్పెండ్ చేయాలని, పేపర్ లీకేజీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది. 


తెలంగాణలో మార్చి 5న జరిగిన అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ), మున్సిపల్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌, జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల రాత పరీక్షను రద్దు చేయాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది. టీఎస్‌పీఎస్సీలో అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌కుమార్‌తోపాటు సిస్టం అడ్మినిస్ట్రేటర్‌ రాజశేఖర్‌రెడ్డి.. అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ప్రశ్నపత్రాన్ని ( AE Question Paper Leaks) ఇతరులకు ఇచ్చినట్లు తేలడంతో కమిషన్‌ ఆ పరీక్షను రద్దు చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు మంగళవారం చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి కమిషన్‌ ఆధ్వర్యంలో కమిషన్ సభ్యులు అత్యవసరంగా సమావేశయ్యారు. పేపర్ లీకేజీ వ్యవహారంపై ఏం నిర్ణయం తీసుకోవాలో చర్చిస్తున్నారు. మరికొంత సమయానికి కమిషన్ ఛైర్మన్  దీనిపై అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. 


ఇద్దరికి ఉద్యోగాలు ఇప్పించబోయి ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులు తమ జీవితాలను రిస్కుల్లో పడేసుకున్నారు. టీఎస్‌పీఎస్సీలో సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌ రాజశేఖర్‌రెడ్డిని ఉద్యోగంలో నుంచి తొలగించారు. అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌కుమార్‌ను సస్పెండ్‌ చేశారు. గురుకుల ఉపాధ్యాయురాలు రేణుక, ఆమె భర్త డీఆర్‌డీఏలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఢాక్య, కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ను రిమాండ్‌కు తరలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురిపై నేడో, రేపో అధికారికంగా చర్యలు తీసుకోనున్నారు.


837 అసిస్టెంట్ ఇంజినీరు పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన రాతపరీక్ష ప్రశ్నపత్రం లీకైందన్న సమాచారంతో నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. మార్చి 5న జరిగిన ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 74 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. దాదాపు 55 వేల మంది హాజరయ్యారు. తొలుత మార్చి 12న నిర్వహించాల్సిన టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్ సీర్(టీపీబీవో) పరీక్ష ప్రశ్నపత్రాలు లీకయ్యాయని భావించారు. కానీ, ఏఈ పరీక్ష ప్రశ్నపత్రాలు లీకైనట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితులు కంప్యూటర్ నుంచి కాపీ చేసిన ఫోల్డర్‌లో ఏఈ పరీక్ష ప్రశ్నపత్రాలతో పాటు భవిష్యత్తులో జరగాల్సిన పరీక్షల ప్రశ్నపత్రాలు కూడా ఉన్నట్లు తెలిసింది. నిందితుల ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిలోని సమాచారం ఆధారంగా పలువురు వ్యక్తులను విచారిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే తొమ్మిది మందిని అరెస్టు చేశారు. వీరిలో ప్రధాన నిందితుడు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పీఏ ప్రవీణ్, గురుకుల ఉపాధ్యాయురాలు రేణుక, పొరుగుసేవల ఉద్యోగి రాజశేఖర్‌ రెడ్డి ఉన్నారు.