Bandi Sanjay : రాష్ట్ర మహిళా కమిషన్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ లేఖ రాశారు. మహిళా కమిషన్ ఎదుట రేపు(బుధవారం) హాజరు కాలేనని ఈ లేఖలో బండి సంజయ్  తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న కారణంగా రేపు మహిళా కమిషన్ ఎదుట హాజరు కాలేనని తెలిపారు. ఈనెల 18న (ఆదివారం) సమయమిస్తే విచారణకు హాజరవుతానని తెలిపారు. ముందుగా సమాచారం ఇచ్చే ఆ సమయానికి హాజరవుతానని చెప్పారు.   


మహిళా కమిషన్ నోటీసులు 


బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజ‌య్‌ కుమార్ కు రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ నోటీసులు జారీ చేసింది. మార్చి 15న ఉద‌యం 11 గంట‌ల‌కు కార్యాలయంలో వ్యక్తిగ‌తంగా విచారణకు హాజ‌రు కావాల‌ని మహిళా క‌మిష‌న్ బండి సంజయ్ ను ఆదేశించింది. ఓ సమావేశంలో కవితపై విమర్శలు చేస్తూ.. అభ్యంతరక వ్యాఖ్యలు చేశారని  బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడింది.  ఈ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై  మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ వ్యాఖ్యల్ని మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. విచారణకు కూడా ఆదేశించింది. సంజయ్‌ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ మహిళా ప్రజాప్రతినిధులు జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు.


బండి సంజయ్ ఏమన్నారంటే ?


ఇటీవల బీజేపీకి సంబంధించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన బండి సంజయ్.. సీఎం కూతురు మాత్రమే గొప్ప అన్నట్లు బీఆర్ఎస్ నాయకుల ప్రవర్తన ఉందని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ కేసులకు బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని, తప్పు చేయకుంటే కోర్టు ద్వారా నిరూపించుకుని బయటకు రావాలని ఆయన అన్నారు. ఇంతక ముందే మీడియా వాళ్లు కవితను అరెస్ట్ చేస్తారని ఓ ప్రశ్న అడిగారని, దోషిగా తేలితే అరెస్ట్ చేయక ఎవరైనా ముద్దు పెట్టుకుంటారా? అని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.  


బండి సంజయ్ వ్యాఖ్యల్ని సమర్ధించను: బీజేపీ ఎంపీ అర్వింద్ 


బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై  చేసిన వ్యాఖ్యలను తాను సమర్థించబోనని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. తెలంగాణలో సామెతలు చాలా ఉంటాయని, వాటిని జాగ్రత్తగా వాడాలని బండి సంజయ్ కు బీజేపీ ఎంపీ అర్వింద్ సూచించారు. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, అయితే ఆయన చేసిన వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదన్నారు. కవితపై చేసిన వ్యాఖ్యల్ని బండి సంజయ్ వెనక్కి తీసుకుంటే బాగుంటుందని సూచించారు. అయితే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగడం కంటే దర్యాప్తు సంస్థలు, విచారణ సంస్థలు అడిగిన విషయాలకు సమాధానాలు చెబితే బెటర్ అని వ్యాఖ్యానించారు. బండి సంజయ్ వ్యాఖ్యలకు బీజేపీకి సంబంధం లేదన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు తాను చేసిన వ్యాఖ్యలపై సంజాయిషీ ఇచ్చుకోవాలన్నారు. కవితపై చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ ఉపసంహరించుకుంటే మంచిదన్నారు.