వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టిలోని కాపు నేతలను బూతులు తిట్టటానికే పవన్ సభ పెడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ పేరుకు మాత్రమేనని, అక్కడ జరిగేది దూషణల సభ అని వెల్లడించారు.
జనసేన సభ కేవలం చంద్రబాబు, పవన్ తస్మదీయ దూషణల సభ మాత్రమేనని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మనం ఏం చేశాం... మనలో లోపాలేంటి అనేది చర్చించుకోవడం రాజకీయ పార్టీ లక్షణమని అయితే అందుకు భిన్నంగా జనసేన ఆవిర్భావ సభ ఉంటుందని ముందుగానే చెప్పారు.
చంద్రబాబు సేవ కోసమే పవన్ రాజకీయ పార్టీ పెట్టారని వ్యాఖ్యానించారు పేర్నినాని. తన పార్టీని అభిమానించే వారందరినీ చంద్రబాబుకు ఓటేయమని పవన్ చెబుతున్నారని అన్నారు. చంద్రబాబు మేలు కోసమే పవన్ పని చేస్తున్నారని తెలిపారు. ఇప్పటం సభకు మచిలీపట్నం సభకు పెద్ద తేడా ఉండదన్నారు. జగన్ మోహన్ రెడ్డిని తనను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఇతర కాపు నాయకులను దూషించడమే పవన్ పని అని తెలిపారు. మచిలీపట్నం సభలో జరగబోయేది ఇదే అంటూ పేర్ని నాని సెటైర్లు వేశారు.
మచిలీపట్నంలో జరగబోయేది ఆవిర్భావసభ కాదు అస్మదీయ దూషణ సభ అని కాపులను చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టడానికే పవన్ తాపత్రయమని వ్యాఖ్యానించారు పేర్ని నాని. పవన్ ఎప్పటికీ మారడని కౌంటర్ ఇచ్చారు. సినిమాలు ప్లాప్ అయితే నష్టాలొస్తాయని,కానీ ప్లాప్ అయిన సినిమాకు కూడా పవన్‌కు లాభాలొచ్చేది ఇక్కడేనని ఎద్దేవా చేశారు. ప్యాకేజ్ స్టార్ అంటే పవన్‌కు కోపం వస్తుందని, అయితే ఏబీఎన్ రాధాకృష్ణ వెయ్యికోట్ల స్టార్ ప్యాకేజ్ అంటే ఆనందపడుతున్నారని నాని వ్యాఖ్యానించారు.
పవన్ సభలో ఏం చెబుతారో ముందే చెబుతా...
పవన్ కల్యాణ్ పార్టీ ఆవిర్బావ దినోత్సవ సభలో ఎవరిపై విమర్శలు చేస్తారో, ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడతారో తనకు ముందే తెలుసని నాని వ్యాఖ్యానించారు. పవన్ టార్గెట్ జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, తెలుగుదేశాన్ని కాపాడుకునేందుకు పవన్ అన్ని ప్రయత్నాలు చేస్తారని అన్నారు. పవన్ ఇలాంటి రాజకీయాలు చేస్తున్నందునే ప్రజలు గుర్తించటం లేదని వ్యాఖ్యానించారు. పవన్ తన సిద్దంతాలను గురించి, పార్టీ భవిష్యత్ కార్యచరణ, వచ్చే ఎన్నికల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ప్రజలకు ఏం చేస్తారో చెబితే బాగుంటుందని నాని వ్యాఖ్యానించారు.
పేర్ని నియోజకవర్గంలోనే పవన్ సభ
మాజీ మంత్రి పేర్ని నాని సొంత నియోజకవర్గంలోనే పవన్ సభ పెడుతున్నారు. దీంతో రాజకీయంగా ఈ వ్యవహరంపైనే టాపిక్ నడుస్తోంది. మొదటి నుంచి పవన్‌ను టార్గెట్ చేస్తూ ఇస్టానుసారంగా కామెంట్స్ చేసిన పేర్ని నాని పై జనసేన నాయకులు,కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ టైంలోనే జనసేన ఆవిర్బావ దినోత్సవ సభ ఖరారు కావటంతో అందరూ అక్కడే ఫోకస్ పెట్టారు. దీంతో ఈ వ్యవహరం రాజకీయంగా హీట్ పెంచింది.
గతేడాది ఇప్పటంలో పవన్ పార్టి వ్యవస్దాపక దినోత్సవాన్ని నిర్వహించారు. ఆ తరువాత నుంచి ఇప్పటం గ్రామంపై అధికారులు ఇళ్ళ నిర్మాణాల తొలగింపులు చేయటం, రాజకీయగా దుమారాన్ని రాజేసింది. ఎడాది గడుస్తున్నాఇప్పటికి ఇప్పటంలో పవన్ నిర్వహించిన పార్టీ వ్యవస్థాపక సభకు సంబంధించిన ఆనవాళ్ళు కనిపిస్తుండటం విశేషం. అంటే రాజకీయంగా పవన్ నిర్వహించిన సభకు ఎలాంటి హైప్ క్రియేట్ అవుతుందనేందుకు ఇప్పటం గ్రామం కేంద్రంగా నిలిచింది.