Radhakishan Rao accused in Phone Tapping Case -హైదరాబాద్: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ టాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డిసిపి రాధాకిషన్ రావుకు హైకోర్టు స్వల్ప ఊరట కలిగించింది. వ్యక్తిగత కారణాలతో మధ్యంతర బెయిల్ ఇచ్చింది కోర్టు. తన తల్లికి అనారోగ్య సమస్య కారణంగా బెయిల్ ఇవ్వాలని రాధా కిషన్ రావు హైకోర్టును ఆశ్రయించారు. దాంతో ఆదివారం (ఏప్రిల్ 21న) ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు కోర్టు అనుమతి ఇచ్చింది.
రాధా కిషన్ రావు తల్లి ప్రస్తుతం కరీంనగర్ లో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అనారోగ్యంతో ఉన్న తన తల్లి దగ్గర కొద్ది గంటలు ఉండేందుకు రాధాకిషన్ రావు పర్మిషన్ కోరగా అందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఆదివారం ఉదయం పోలీస్ ఎస్కార్ట్ మధ్య జైల్ నుంచి కరీంనగర్ కు రాధా కిషన్ రావ్ ను తరలించనున్నారు. తన తల్లితో కొన్ని గంటలు ఉన్న తరువాత పోలీసులు తిరిగి టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీని హైదరాబాద్ కు తీసుకురానున్నారు.