Revanth Reddy should be CM for 5 years KTR interesting comments at BRS meeting- హైదరాబాద్: మల్కాజ్ గిరిలో బీజేపీతోనే మనకు పోటీ, గత పదేళ్లలో తెలంగాణకు ప్రధాని మోదీ చేసిందేమిటీ? పదేళ్లలో కేసీఆర్ పాలనలో చేసిందేంటో ఒక్కసారి చెక్ చేసుకోవాలని కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మనమే తప్పు చేసినం. మనం చేసిన మంచి పనులను చెప్పుకోవాల్సినంత చెప్పుకోలే అన్నారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పు జరగకుండా చూసుకోవాలె అని పార్టీ శ్రేణులకు సూచించారు. నువ్వే 5 ఏళ్లు సీఎంగా ఉండాలె. చెప్పిన 420 హామీలు అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మేడ్చల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మందికి పుట్టిన బిడ్డలను తన బిడ్డలని చెప్పుకునే తత్వం రేవంత్ రెడ్డిది అన్నారు. బీఆర్ఎస్ చేసిన పనులను నేను చేశానని చెప్పుకోవటానికి సీఎం రేవంత్ కు సిగ్గు, శరం ఉండాలన్నారు.


‘అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తానని రేవంత్ రెడ్డి కూడా అనుకోలేదు. కానీ అదృష్టం కొద్ది గెలిచిండు.మొన్నటి దాకా బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అంటివి. ఇప్పుడు గత గవర్నమెంట్ బీజేపీతో లొల్లి పెట్టుకుందంటున్నావ్. అబద్దాలు చెప్పుకుంటూ తప్పుడు ప్రచారం చేస్తుండటం చూస్తే రేవంత్ రెడ్డి మీద జాలేస్తోంది. కాంగ్రెసోళ్లు పచ్చి మోసగాళ్లు. ఏడాది లో 2 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పారు. నాలుగు నెలల్లో ఒక్క జాబ్ ఇవ్వలేదు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగులు నీ ఖాతాలో వేసుకుంటే విద్యార్థులు చైతన్యవంతులు మీ అంతు చూస్తారు. రేవంత్ రెడ్డి గానీ, బీజేపీ గానీ మల్కాజ్ గిరికి చేసింది గుండుసున్నా. ఒక్క కొత్త మెడికల్ కాలేజ్, నవోదయ పాఠశాల, కొత్త కాలేజ్ కూడా ఇవ్వలేదు. బండి సంజయ్ అయితే ప్రధాని మోదీని దేవుడని  అంటాడు. అసలు మోడీ ఎవరికీ దేవుడు? ఎందుకు దేవుడు అవుతాడు. రేట్లు పెంచినందుకా, మహిళలకు దేవుడా, ఏం అభివృద్ధి చేసిండని దేవుడు అయ్యాడంటూ’ కేటీఆర్ మండిపడ్డారు.


‘మతం పేరుతో బీఆర్ఎస్ ఏనాడూ రాజకీయాలు చేయలేదు. నిజమైన హిందూవు మతం పేరుతో రాజకీయాలు చేయడు. ఏం చేశావంటే జై శ్రీరామ్ పేరుతో రాజకీయాలు చేయటమే బీజేపీకి తెలిసింది. రుణమాఫీ చేయలేదని మాట్లాడుతున్నందుకు ఈటల రాజేందర్ కు సిగ్గు అనిపియ్యాలే. నువ్వు ఆర్థిక మంత్రి ఉన్నప్పుడే 16 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసింది కేసీఆర్. మోదీ మాత్రం పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు పెద్ద పారిశ్రామిక వేత్తలకు రుణమాఫీ చేసిండు. ఏం మొఖం పెట్టుకొని బీజేపీ ఓట్లు అడుగుతుంది. మల్కాజ్ గిరిలో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా బీజేపీకి  ఎందుకు రాలేదు. రాహుల్ గాంధీ ఏమో చౌకిదార్ చోర్ హై అంటాడు. రేవంత్ రెడ్డి ఏమో మోడీ హమారా బడే భాయ్ అంటాడు.’  కేటీఆర్


రాగిడి లక్ష్మారెడ్డిని మనం గెలిపించుకోవాలె 
10 కార్పొరేషన్లను మేడ్చల్ కార్యకర్తలు గెలిపించారు. రాగిడి లక్ష్మారెడ్డిని మనం గెలిపించుకోవాలె, కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థిని తీసుకొచ్చి మన మీద రుద్దే ప్రయత్నం చేసిందన్నారు కేటీఆర్. కేసీఆర్ గారు ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేశారు. కేసీఆర్ ఏం చేసిండో మేము చెప్తాం. ఈటల రాజేందర్ కి దమ్ముంటే మోదీ మల్కాజ్ గిరికి ఏం చేసిండో చెప్పి ఓట్లు అడగాలన్నారు. బీజేపీ మల్కాజ్ గిరికి చేసింది గుండుసున్నా అని, పదేళ్లు కంటోన్మెంట్ లో భూములు కావాలని అడిగితే పట్టించుకోలేదని తెలిపారు. తెలుగు అధికారి గిరిధర్ అనే వ్యక్తి ద్వారా ఆ ఫైల్ కదిలిందన్నారు.


రాహుల్ ఫ్రాడ్ అంటే రేవంత్ ఫ్రెండ్ అంటాడు.. 
రాహుల్ గాంధీ అదానీ ఫ్రాడ్ అంటే, రేవంత్ రెడ్డి అదానీ నా ఫ్రెండ్ అంటాడు. రాహుల్ గాంధీ ఏమో లిక్కర్ స్కాం ఏం లేదంటాడు. కేజ్రీవాల్ అరెస్ట్ అన్యాయమని అంటాడు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కవితమ్మ అరెస్ట్ కరెక్టే అంటాడు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కోసం పనిచేస్తుండా? మోదీ కోసం పనిచేస్తుండా ? అని కేటీఆర్ ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళ్లే మొట్ట మొదటి వ్యక్తి జంపింగ్ జపాంగ్ రేవంత్ రెడ్డే. రేవంత్ రెడ్డి బీజేపీలో వెళ్లటం పక్కా. ఈ విషయం మీద ఎందుకు రేవంత్ ఎందుకో స్పందిచటం లేదు. మెడల పేగులు వేసుకొని తిరిగేటోడు ముఖ్యమంత్రా? మానవబాంబు అవుతా అంటాడు. ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం తమకు లేదన్నారు కేటీఆర్.