Vivaha Prapthi Program Cancelled In Chilukuru Balaji Temple: హైదరాబాద్ (Hyderabad) నగర శివారులోని చిలుకూరు (Chilukuru) బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ (Rangarajan) కీలక ప్రకటన చేశారు. ఆలయం ప్రాంగణంలో ఆదివారం జరగాల్సిన 'వివాహ ప్రాప్తి' రద్దు చేస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం గరుడ ప్రసాదంలో తలెత్తిన ఇబ్బందుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు తమ ఇళ్లలోనే దేవున్ని ప్రార్థించుకోవాలని సూచించారు. అయితే, ఆదివారం సాయంత్రం జరిగే కల్యాణోత్సవం యథాతథంగా జరుగుతుందని స్పష్టం చేశారు. కాగా, సంతానం లేని వారి కోసం గరుడ ప్రసాదం పంపిణీ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో శుక్రవారం బాలాజీ ఆలయానికి వెళ్లే దారులన్నీ భక్తులతో నిండిపోయాయి. ఒక్కసారిగా అధిక సంఖ్యలో కార్లు, వాహనాల్లో తరలిరావడంతో కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జాం నెలకొంది. మాసబ్ ట్యాంక్ నుంచి మెహదీపట్నం, నానల్ నగర్, లంగర్ హౌస్, సన్ సిటీ, అప్పా జంక్షన్ మీదుగా చిలుకూరు ఆలయం వరకూ ట్రాఫిక్ స్తంభించిపోయింది. గరుడ ప్రసాదం కోసం దాదాపు 1.50 లక్షల మందికి పైగా వచ్చినట్లు పోలీసులు అంచనా వేశారు. అయితే, ప్రసాదం కేవలం 10 వేల మందికే సరిపోయేంత మాత్రమే ఉండగా ఉదయం 10 గంటలకే 70 వేల మందికి పైగా భక్తులు లైన్లో నిల్చున్నారు. దీంతో మళ్లీ చేయించి మధ్యాహ్నం 12 గంటల వరకూ సుమారు 35 వేల మందికి గరుడ ప్రసాదాన్ని పంపిణీ చేశారు.
అసలేంటీ గరుడ ప్రసాదం.?
చిలుకూరు బాలాజీ ఆలయంలో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఈ ఆలయంలో 108 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. ప్రతి ఏటా శ్రీరామనవమి తర్వాత దశమి రోజు నుంచి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. తొలి రోజు వేద పండితులు పుట్టమన్నుతో హోమ గుండాలు ఏర్పాటు చేసి బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. శుక్రవారం ధ్వజారోహణం, శేషవాహన సేవలు నిర్వహించనున్నారు. శుక్రవారం గరుత్మంతునికి నైవేద్యం సమర్పించారు. అనంతరం సంతానం లేని మహిళలకు గరుడ ప్రసాదం పంచనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ ఇటీవల ప్రకటించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఒక్కసారిగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ ప్రసాదం తింటే సంతానం లేని సంతాన భాగ్యం కలుగుతుందనేది భక్తుల విశ్వాసం. అయితే, ఒక్కసారిగా ఊహించిన దాని కంటే ఎక్కువగా భక్తులు రావడంతో ప్రసాదం పంపిణీ నిలిపేశారు. గతంలో అయితే తొలిరోజు తరువాత రెండో, మూడో రోజు సైతం గరుడ ప్రసాదం వితరణ ఉండేదన్నారు. కానీ ఈ ఏడాది తొలిరోజుతోనే గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేసినట్లు రంగరాజన్ స్పష్టం చేశారు. గరుడ ప్రసాదం కోసం భక్తులెవరూ చిలుకూరు బాలాజీ ఆలయానికి వచ్చి ఇబ్బంది పడకూడదని చెప్పారు.
వైభవంగా బ్రహ్మోత్సవాలు
మరోవైపు, చిలుకూరు బాలాజీ ఆలయంలో ఈ నెల 21న సూర్యప్రభ వాహనం, గరుడ వాహనం సేవలు.. అదే రోజు రాత్రి 10:30 గంటలకు స్వామి వారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. ఈ నెల 22న వసంతోత్సవం, గజవాహన సేవలు, 23న పల్లకి సేవ, అర్దరాత్రి 12 గంటలకు స్వామి వారి రథోత్సవం ఊరేగింపు ఉంటుంది. 24న మహాభిషేకం, ఆస్థాన సేవ, అశ్వవాహన సేవ, పుష్పాంజలి సేవలు నిర్వహిస్తారు. ఈ నెల 25న చివరి రోజు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ నిర్వహకులు తెలిపారు.